మోర్తాడ్(బాల్కొండ): వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రవాసీ విధానాన్ని రూపొందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఎన్నారై అడ్వయిజరీ బోర్డు అధ్యయనం పట్టాలెక్కకపోవడంతో వలసదారుల ప్రయోజనాలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. 2025 ఏప్రిల్ 10వ తేదీన ఎన్నారై అడ్వయిజరీ బోర్డును ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. అధ్యయనం చేసి నివేదికను అందించడానికి రెండేళ్ల కాలపరిమితిని నిర్ణయించింది. ఇప్పటికే 14 నెలల కాలం గడచిపోయినా బోర్డు అధ్యయనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. సలహా కమిటీ తీరు సరిగా లేకపోవడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైందనే ఆరోపణలతో బోర్డు సభ్యత్వానికి గుగ్గిల్ల రవిగౌడ్ శనివారం రాజీనామా చేశారు. సభ్యుని రాజీనామాతో ప్రవాసీ విధానం రూపకల్పన అటకెక్కిందని వలస కార్మికుల్లో చర్చ జరుగుతోంది.
ఉద్ధండులతోనే కమిటీ ఏర్పాటు
ఎన్నారై అడ్వయిజరీ బోర్డులో గల్ఫ్ అంశాలు, వలస కార్మికుల సమస్యలపై ఎంతో అవగాహన ఉన్నవారే సభ్యులుగా ఉన్నారు. పదవీ విరమణ చేసిన ఐఎఫ్‌ఎస్ అధికారి, వివిధ దేశాల్లో రాయబారిగా, మన దేశంలో పాస్‌పోర్టు అధికారిగా సేవలందించిన డాక్టర్ వినోద్‌కుమార్ నేతృత్వంలో కమిటీ కొనసాగుతోంది. అంతర్జాతీయ వలసల విశ్లేషకులు మంద భీంరెడ్డి, వలస కార్మిక సంఘాల నాయకులైన స్వదేశ్ పరికిపండ్ల, నంగి దేవేందర్‌రెడ్డి, సిస్టర్ లిజీ జోసెఫ్, సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్‌రావు, కొట్టాల సత్యం నారాగౌడ్, గుగ్గిల్ల రవిగౌడ్(రాజీనామా చేసిన వ్యక్తి)తో పాటు ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, డాక్టర్ భూపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి(బీఆర్‌ఎస్‌లో చేరక ముందు) సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ కమిటీ మన రాష్ట్రంలో వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేయాల్సి ఉంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ప్రవాసీ విధానాన్ని రూపొందచడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కమిటీ కేవలం నిర్మల్ జిల్లాతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే పర్యటించింది. అధ్యయనం కోసం ఎన్నో పర్యటనలు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం నుంచి సహకారం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కమిటీ సభ్యులు ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించే స్థితిలో లేకపోవడంతో అధ్యయనం పట్టాలు ఎక్కడం లేదనే వాదన వినిపిస్తోంది. రవిగౌడ్ రాజీనామాతో అధ్యయనం ఎంత వరకు వచ్చిందనే విషయం బహిర్గతమైందని స్పష్టమవుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వలస కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని పలువురు సూచిస్తున్నారు.
కాగితాలకే పరిమితమైన
ఎన్నారై అడ్వయిజరీ బోర్డు
ప్రభుత్వ ప్రోత్సాహం లేదని
సభ్యుని రాజీనామా
వలస కార్మికుల ప్రయోజనాలపై
నీలినీడలు


