ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‘రాజకీయం’ | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‘రాజకీయం’

Jun 1 2026 12:56 AM | Updated on Jun 1 2026 12:56 AM

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

రైతులు ఆందోళన చెందవద్దు

రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి

కమ్మర్‌పల్లి : యాసంగి ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తున్నాయని రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతులను తప్పుదోవ పట్టించాలనే దురుద్దేశంతో కల్లాల వద్దకు వెళ్లి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆదివారం ఆయన కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకా రం చేసిన తర్వాత నాలుగు సీజన్‌లలో రైతులకు ఇబ్బంది లేకుండా చేశాం, ప్రస్తుత ఐదో సీజన్‌లో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంపై పోరాడాల్సిన బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై మాట్లాడుతున్న తీరు వారి అనాలోచిత విధానానికి నిదర్శనమని విమర్శించారు. ధాన్యానికి మద్దతు ధర నిర్ణయించే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు బాధ్యత ఎందుకు తీసుకోదని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఒప్పందం ప్రకారమే కోత అని లేఖల ద్వారా ఉసిగొల్పి రైతుల ఉసురు పోసుకున్నది ఎవరో మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి తెలియదా అని మోహన్‌రెడ్డి నిలదీశారు. ప్రస్తుతం 95 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని, ఇవేవీ ఎరగనట్టు చిన్నచిన్న సమస్యలతో మిగిలిన కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులు ఇబ్బంది పడుతున్నారని అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు బోనగిరి భాస్కర్‌, నాయకులు సుంకెట రవి, తిప్పిరెడ్డి శ్రీనివాస్‌, సల్లూరి గణేష్‌గౌడ్‌ భూపతిరెడ్డి, రాజు, జనార్ధన్‌, శ్రీనివాస్‌, అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement