● ప్రీ ప్రైమరీ పుస్తకాలు రూపొందించిన టీమ్‌లో బోయడ నర్సయ్యకు చోటు
మోర్తాడ్(బాల్కొండ): ‘విద్యార్థులకు చదువుపై ఆసక్తిని పెంచాలి, వారికి అర్థమయ్యేలా పాఠాలు చెప్పా లి..’ ఎప్పుడూ ఇదే ఆలో చిస్తూ ఆచరణలో పెడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు బోయడ నర్సయ్య ప్రీ ప్రైమ రీ పిల్లల కోసం పుస్తకాలు రూపొందించే టీములో ఒక మెంబర్ అయ్యారు. బోధనలో ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను ఎంచుకునే నర్సయ్య బాల్కొండ మండలం బస్సాపూర్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. తమ పాఠశాల విద్యార్థులకే కాదు రాష్ట్రంలోని పూర్వ ప్రాథమిక విద్యార్థులందరికీ చదువు ఆసక్తిని పెంచేలా గేయాలు, కథలను రచించాడు. వాటిని రాష్ట్ర విద్యాశాఖ గుర్తించి ప్రీప్రైమరీ విద్యార్థుల కోసం ప్రచురించిన పాఠ్య పుస్తకంలో చోటు కల్పించింది. 2026 – 27 విద్యా సంత్సరం నుంచి అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ(ఎల్‌కేజీ, యూకేజీ)ని విద్యాశాఖ అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను విద్యాశాఖ ముద్రించింది. పుస్తక రచన కోసం రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది కంటెంట్ రైటర్లను ఎంపిక చేయగా, జిల్లాకు చెందిన నర్సయ్యకు అవ కాశం లభించింది. ప్రీప్రైమరీ పుస్తకాన్ని ప్రజాపాలన విద్యావారోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ ఉన్నతాధికారులు యోగితారాణా, దేవసేన, రమేశ్ ఆవిష్కరించారు. చిన్నారులకు ప్రతి పాఠం అర్థమయ్యేలా ఎన్నో ప్రయోగాలను నిర్వహించిన నర్సయ్యకు రాష్ట్రస్థాయి పుస్తక రచనలో అవకాశం దక్కడం జిల్లాకు లభించిన ప్రత్యేక గుర్తింపు విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


