హిందీ సాహిత్యంలో దిట్ట | - | Sakshi
Sakshi News home page

హిందీ సాహిత్యంలో దిట్ట

May 31 2026 1:54 AM | Updated on May 31 2026 1:54 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఇందూరు జిల్లాకు చెందిన శ్రీమన్నారాయణచారి హిందీ పండిత్‌గా పనిచేస్తూనే హిందీ సాహిత్యంపై మక్కువతో ఎంపిక చేసుకున్న వివిధ అంశాలపై నిరంతరం అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో వేలాది రచనలు, పాటలు రాస్తూ వస్తున్నారు. జాతీయ స్థాయి లో హిందీ సాహిత్యంపై గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీల్లో పలుసార్లు ప్రథమ స్థానాలను గెలుచుకుని గౌరవ సత్కారాలు అందుకున్నారు. మరోవైపు జాతీయ స్థాయి హిందీ సాహిత్య మాస పత్రికల ముఖచిత్రాలుగా శ్రీమన్నారాయణచారి ఫొటోలను ముద్రించడం ఆయనకే కాకుండా జిల్లాకు సైతం గర్వకారణంగా నిలిచింది. జాతీయ స్థాయిలో హిందీ కవిగా, రచయితగా ఇందూరు జిల్లా ఖ్యాతి నిలబెట్టడంతో పాటు తెలుగులోనూ పాటలు రాస్తుండడం గమనార్హం. కాగా ‘విరాట్‌’ అనే కలం పేరుతో శ్రీమన్నారాయణ రచనలు చేస్తున్నారు.

రెంజల్‌ మండలంలోని నీల గ్రామానికి చెందిన శ్రీమన్నారాయణ రాసిన పాటలు లోతైన భావం, అర్థంతో కూడుకుని ఉంటాయని సాహిత్య అభిమానులు చెబుతున్నారు. ప్రజలను ఆలోచింపజేసే విధంగా పాటలు, రచనలు చేస్తున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు. జాతీయ స్థాయి వేదికలపై హిందీ ఉపన్యాసాలు, కవితలతో తనదైన ముద్ర వేసుకుంటున్నారు శ్రీమన్నారాయణ. జాతీయ స్థాయిలోనూ ఈయన కవితలకు మంచి జనాదరణ లభిస్తుండడం విశేషం. తెలుగులోనూ ఇటీవల ఆయన రాసిన ‘శతవసంత పతమునందు ప్రవహించే గంగ ఇది’ పాట తెలుగు రాష్ట్రాల్లో ప్రశంసలు అందుకుంది. పలు సినిమాలకు సైతం శ్రీమన్నారాయణ బాణీలను అందించారు.

ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర పై విశేష పరిశోధన చేస్తూ శివాజీ జీవితానికి సంబంధించి అనేక స్ఫూర్తిదాయకమైన కవితలను, పాటలను రచించారు. ప్రస్తుతం ఛత్రపతి శివాజీ జీవితం మొత్తాన్ని అధ్యయనం చేసి ఒక పుస్తక రూపంలో తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా మహాదేవుడి భక్తి పాటలు, శ్రీరాముడి అయోధ్య భూమి చరిత్ర పాటలు, జనాలను ఆలోచింపజేసే స్ఫూర్తిదాయకమైన పాటలు, తన్మయత్వంలోకి తీసుకెళ్లే భక్తి పాటలు రాస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

హిందీ, తెలుగు భాషల్లో అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వగలిగే శ్రీమన్నారాయణ అనేక కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగానూ వ్యవహరించారు. మాజీ గవర్నర్లు జిష్ణుదేవ్‌ వర్మ, బండారు దత్తాత్రేయ, వివిధ హిందీ రాష్ట్రాలకు చెందిన మంత్రులు శ్రీమన్నారాయణ రచనలను చదివి ప్రశంసలు అందించారు.

తన ప్రతిభతో అనేక సత్కారాలు, బిరుదులు సాధించిన శ్రీమన్నారాయణ దేశభక్తుల జీవిత చరిత్రలు, సమకాలీన అంశాలను క్రోడీకరిస్తూ అనేక స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలను దేశవ్యాప్తంగా ఇస్తుండడం అభినందనీయం. ఆయన ఇందూరు ఆణిముత్యం అవార్డును పొందారు.

జాతీయ స్థాయిలో రాణిస్తున్న

శ్రీమన్నారాయణ

మాసపత్రికలపై ఆయన ముఖచిత్రాలు

కలం పేరు ‘విరాట్‌’..

వేలాది రచనలు, పాటలు

కవి సమ్మేళనాల్లో పలుమార్లు

ప్రథమ బహుమతులు

Advertisement
 
Advertisement
Advertisement