మోపాల్: మాజీ మంత్రి, సీనియర్ నాయకులు శనిగరం సంతోష్‌రెడ్డి, ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి (వాసుబాబు)ని శనివారం హైదరాబాద్‌లోని వారి నివాసంలో రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకార, ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ బాడ్సి చంద్రశేఖర్ గౌడ్, డీసీసీ ప్రధానకార్యదర్శి గడ్కోల్ భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. సంతోష్‌రెడ్డి సతీమణి విజయారెడ్డి ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో వారి కుటుంబీకులను ఇరువురు ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా సంతోష్‌రెడ్డి ఆరోగ్యం, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
భిక్కనూరు: తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో పీజీ సెంటర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూ ర్వ విద్యార్థులు (1999–2001) సిల్వర్ జూబ్లీ సమ్మేళనం శనివారం నిర్వహించుకున్నారు. పీజీ సెంటర్‌లో ఆర్గానిక్ కెమిస్ట్రీని అభ్యసించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 22 మంది విద్యార్థులు ఈ సిల్వర్ జూబ్లీ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆనాటి బ్యాచ్ విద్యార్థులు అందరూ ఉన్నత స్థానాల్లో ఉండటం హర్షణీయమని ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్, బాలుర హాస్టల్ వార్డెన్ యాలాద్రి అన్నారు. వీరందరూ ఫార్మ, ఇతర వ్యాపార రంగాలలో దేశ విదేశాల్లో స్థిరపడటం ఎంతో గర్వకారణమన్నారు. పూర్వ విద్యార్థుల కమిటీ సభ్యులు ఎంబీ.లక్ష్మణ్, పి.రాజు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: అన్నదాతలు ఆర్గానిక్ పంటల సాగుపై ఆసక్తి చూపాలని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ అన్నారు. హైదరాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఆర్గానిక్ మేళాలో గంగాధర్ పాల్గొని, మాట్లాడారు. సేంద్రియ పద్ధతి ద్వారా పండించిన పంటలతో ప్రజలకు ఆరోగ్యంతోపాటు అనేక పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారం లభిస్తుందన్నారు. రైతులు సేంద్రియ వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. రసాయన ఎరువులు, మందులు పిచికారీ చేయకుండా ఉండాలన్నారు. అంతకుముందు మేళాలో ఏర్పాటు చేసిన పలు ఆర్గానిక్ ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.


