● దుబాయ్‌లో దొరకని
దత్తాపూర్ వాసి ఆచూకీ
● పది రోజుల క్రితమే
గల్ఫ్‌కి వెళ్లిన జంగం రాజన్న
● ఆందోళనలో కుటుంబ సభ్యులు
డొంకేశ్వర్(ఆర్మూర్): ఉపాధి కోసం ఇటీవల గల్ఫ్‌కు వెళ్లిన డొంకేశ్వర్ మండలం దత్తాపూర్ వాసి జంగం రాజన్న ఆచూకీ దొరకడం లేదు. పది రోజులుగా ఇంటికి ఫోన్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు ఇలా.. దత్తాపూర్‌కు చెందిన జంగం రాజన్నది (48) పేద కుటుంబం. ఊరిలోనే డప్పు కొడుతూ ఉన్న కొద్ది భూమిలో వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెద్ద కొడుకు రమేశ్‌ను ఇటీవల దుబాయ్‌కి పంపించాడు. తను కూడా ఈ నెల 22న దత్తాపూర్ ఏజెంట్ ద్వారా ఓ కంపెనీలో పని చేయడానికి దుబాయ్‌కు వెళ్లాడు. ఫ్లైట్ దిగిన వెంటనే తాను క్షేమంగా చేరుకున్నట్లు ఇంటికి ఫోన్ చేశాడు.
కంపెనీ రూం నుంచి బయటికి వెళ్లిన రాజన్న మళ్లీ తిరిగి రూమ్‌కు రాలేదు. రాజన్న తప్పిపోయి, తిరుగుతున్నాడని నిర్మల్‌కు చెందిన ఓ వ్యక్తి ద్వారా నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. రాజన్నను భద్రంగా కంపెనీ రూము వద్దకు తీసుకెళ్లినట్లుగా చెబుతున్నప్పటికీ ఆయన ఆచూకీపై ఇప్పటివరకు స్పష్టత రావడం లేదు. అక్కడున్న పని చేస్తున్న వ్యక్తులు కూడా సరైన సమాచారం ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. దుబాయ్‌లో ఉన్న కొడుకు రమేష్ సైతం తండ్రి కోసం వెతుకుతున్నాడు. ఇటు ఇంటి వద్ద ఉన్న భార్య అనిత, చిన్న కొడుకు రిషి రాజన్న జాడ తెలియక యాడున్నడో... ఎట్లున్నడో అని నిత్యం ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి రాజన్న జాడను తెలుసుకొచి ఇంటికి రప్పించాలని వేడుకుంటున్నారు.


