సిరికొండ : సిరికొండ మండలంలోని వివిధ మార్గాల్లో వ్యవసాయ బావులు ప్రమాదకరంగా ఉన్నాయి. రోడ్డుకు సమీపంలోనే బావులు ఉండటంతో ప్రయాణికులు, వాహనదారులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. మూలమలుపుల వద్దనే వ్యవసాయ బావులు ఉండటంతో ప్రయాణం మరింత ఇబ్బందికరంగా మారింది. మండల కేంద్రం నుంచి చిన్నవాల్గోట్ వెళ్లే మార్గంలో రెండు చోట్ల రోడ్డు పక్కనే వ్యవసాయ బావులు ఉన్నాయి. ఈ మార్గంలోనే ప్రభుత్వ ఆదర్శ పాఠశాల, వ్యవసాయ గోదాములు ఉన్నాయి. విద్యార్థుల కోసం పాఠశాల వరకు ఆర్టీసీ బస్సు నడుస్తుంది. బస్సు సౌకర్యం లేని గ్రామాలకు చెందిన విద్యార్థులు ఆటోలు, సైకిళ్లపై పాఠశాలకు వస్తుంటారు. సింగిల్ రోడ్డు కావడంతో వ్యవసాయ బావుల వద్ద ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయి బావులను కప్పేశాయి. మండల కేంద్రం నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన లొంక ఆలయానికి వెళ్లే మార్గంలో మహిపాల్ తండా సమీపంలో ఒక చోట వ్యవసాయ బావి ప్రమాదకరంగా ఉంది. ఇది కూడా మూలమలుపు వద్దనే ఉంది. ఆలయానికి ప్రతిరోజు ఈ మార్గంలో భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ బావి వద్ద ఎలాంటి హెచ్చరికలను ఏర్పాటు చేయలేదు. జిల్లాలో గతంలో రోడ్ల వెంబడి గల వ్యవసాయ బావుల్లో ఆటోలు, ట్రాక్టర్లు పడిపోయి ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. మండలంలో ఎలాంటి ప్రమాదాలు జరగకముందే రోడ్ల వెంబడి ఉన్న వ్యవసాయ బావులను పూడ్చివేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
మూలమలుపుల వద్దే
వ్యవసాయ బావులు
ప్రయాణికులకు
పొంచి ఉన్న ప్రమాదం
బావులను పూడ్చివేయాలని విన్నపం


