క్యూ కట్టాల్సిన పని లేదిక.. | - | Sakshi
Sakshi News home page

క్యూ కట్టాల్సిన పని లేదిక..

May 29 2026 2:13 AM | Updated on May 29 2026 2:13 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా అందించే పింఛన్‌ డబ్బుల కోసం పోస్టాఫీసులు, గ్రామ పంచాయతీల వద్ద గంటల తరబడి క్యూ లైన్‌లలో నిలబడే అవస్థలకు త్వరలోనే తెరపడనుంది. గ్రామీణప్రాంత లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం పింఛన్‌ డబ్బులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించింది. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, ఒంటరి మహిళా, బీడీ కార్మికులు, చేనేత, కల్లుగీత కార్మికులు కలిపి మొత్తం 2.61లక్షల మంది పింఛన్లు పొందేవారున్నారు. ప్రతినెలా జిల్లాలో రూ.56.35 కోట్ల నిధులు పంపిణీ చేస్తున్నారు. అయితే, పట్టణ ప్రాంతాలకు చెందిన 58,639మంది లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో రూ.12.80 కోట్ల వరకు జమ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. మిగిలిన 2,02,889 మంది గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులకు పోస్టాఫీసులు, జీపీ కార్యాలయల వద్ద నగదును పంపిణీ చేస్తున్నారు. పోస్టాఫీసు సిబ్బంది వచ్చి డబ్బులు పంచే క్రమంలో లబ్ధిదారులు క్యూ కట్టడం, నెట్‌వర్క్‌ సమస్యలతో ఆలస్యం అవుతోంది. వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి పోవడంతో గ్రామీణ లబ్ధిదారులకు సైతం బ్యాంకు ఖాతాలోనే డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అధికారులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల నంబర్లను సేకరించి ఆన్‌లైన్‌ చేయనున్నారు. దీనికి సంబంధించి ఆదేశాలు రానున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొటున్నారు.

ఇక నుంచి గ్రామీణ లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్‌ డబ్బులు జమ

నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

పోస్టాఫీసుల ద్వారా పంపిణీలో జాప్యమే కారణం

Advertisement
 
Advertisement
Advertisement