ధర్పల్లి: మండలంలోని గోవింద్‌పల్లి గ్రామానికి చెందిన లక్షిత ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు వరకట్నం వేధింపులకు పాల్పడిన భర్త కర్రోళ్ల నెహ్రూతోపాటు అత్త సత్తెమ్మ, మామ రాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ ప్రకాశ్ ఆదేశాల మేరకు బుధవారం నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై వినయ్ తెలిపారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్ కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం కోర్టులో హాజరు పర్చగా , న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారన్నారు.
● నగదు, బంగారం, బైక్‌ను ఎత్తుకెళ్లిన దుండగుడు
నిజామాబాద్ అర్బన్: నగరంలోని పద్మనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి ఓ దుండగుడు నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడ్డాడు. రాజయ్య అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన దుండగుడు బీరువా పగులగొట్టి రూ.5 వేలతోపాటు ఇంట్లోని మహిళను కత్తితో బెదిరించి బంగారాన్ని దోచుకెళ్లాడు. అలాగే సునీత ఇంట్లోకి చొరబడి బీరువా పగులగొట్టి బంగారం, వెండితోపాటు రూ.5 లక్షల 30వేలు ఎత్తుకెళ్లాడు. పక్కనే ఉన్న విజయ అనే మహిళ ఇంట్లోకి చొరబడిన దుండగుడు రూ.9 వేల నగదు అపహరించాడు. కోటగల్లిలోని ఓ ఇంటి ముందు నుంచి మనోజ్ అనే వ్యక్తికి చెందిన బైక్‌ను ఎత్తుకెళ్లాడు. వరుస దొంగతనాలకు పాల్పడింది ఒక్కడేనని సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.
మద్నూర్(జుక్కల్): మండలంలోని రుసేగావ్ గేట్ వద్ద 161వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున మామిడి పండ్ల లారీ బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి రాజస్థాన్‌కు మామిడి పండ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ మండలంలోని రుసేగావ్ గేట్ సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డు మధ్యలో బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. మామిడిపండ్లు రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రెండుగంటలపాటు శ్రమించి క్రేన్ సహాయంతో లారీని పక్కకు జరిపారు. రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.


