ఆర్మూర్: పోలీస్ స్టేషన్‌ల పరిధిలో నైట్ పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేయాలని, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడంతోపాటు వాహనాల తనిఖీలను పకడ్బందీగా చేపట్టాలని సీపీ సాయిచైతన్య సిబ్బందిని ఆదేశించారు. డివిజన్ పరిధిలో కేసులు, నేరాల నియంత్రణపై పట్టణంలోని ఆర్మూర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. పాత నేరస్తులపై నిఘా సారించాలని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. పోలీస్ స్టేషన్‌లలో స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, మహిళలకు రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. షీ టీమ్స్, ఈగల్ టీమ్స్ , చీతా ఫోర్స్ వంటి ప్రత్యేక బృందాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని అన్నారు. విద్యాసంస్థలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచాలని, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ అంజయ్య, ఆర్మూర్, భీమ్‌గల్ ఎస్‌హెచ్‌వోలు సత్యనారాయణ, పొన్నం సత్యనారాయణ, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్‌రెడ్డి, భీమ్‌గల్, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, బాల్కొండ, కమ్మర్‌పల్లి, మోర్తాడ్, వేల్పూర్, నందిపేట్, ఆర్మూర్ ఏస్సైలు తిరుపతి, కిరణ్‌పాల్, సుహాసిని, రాజేశ్వర్, శైలేందర్, అనిల్‌రెడ్డి, రాము, సంజీవ్, శ్యామ్ రాజ్, రజనీకాంత్ , వినయ్‌కుమార్, ఐటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పాత నేరస్తుల కదలికలపై నిఘా సారించండి.. అవసరమైతే పీడీ
యాక్ట్ నమోదు చేయాలి
పోలీస్ స్టేషన్‌లలో స్నేహపూర్వక
వాతావరణం ఉండాలి
సమీక్షా సమావేశంలో
సీపీ సాయిచైతన్య


