నిజామాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 177 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, వి భుజంగరావుతో పాటు ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, డీఆర్‌వో బి గీత, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్ రావులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ ప్రజావాణిలో 45..
నిజామాబాద్‌అర్బన్ : పోలీస్ ప్రజావాణిలో సోమవారం 45 ఫిర్యాదులు వచ్చాయి. సీపీ సాయిచైతన్య ఫిర్యాదులను స్వీకరించారు. తక్షణమే చట్టపరంగా సమస్యలను పరిష్కరించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రజలు సమస్య పరిష్కారం కోసం నేరుగా పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు.
నేడు స్పెషల్ కేటగిరీ
సర్టిఫికెట్ వెరిఫికేషన్
తెయూ(డిచ్‌పల్లి): దోస్త్ కోర్సులలో స్పెషల్ కేటగిరి రెండో విడతలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు (పీహెచ్‌సీ/ సీఏపీ/ ఎన్‌సీసీ / స్పోర్ట్స్ /ఎక్స్‌ట్రా కరికులమ్ ఆక్టివిటీస్) ఈ నెల 26న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెయూ అకడమిక్ ఆడిట్ సెల్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు.
డ్రంకెన్ డ్రైవ్‌లో ఇద్దరికి జైలు
నిజామాబాద్‌అర్బన్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఇద్దరికి జైలు శిక్ష, మరో 30 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సీఐ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం వాహనాల తనిఖీలు చేపట్టగా 32 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని పేర్కొన్నారు. వారిని సెకండ్‌క్లాస్ మేజిస్ట్రేట్ హైమ ద్ మొయినుద్దీన్ ఎదుట ప్రవేశపెట్టగా కొయ్యడ శ్రీశైలం, వినోద్ కుమార్‌లకు వారం రోజులు జైలు శిక్ష విధించారు.


