నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు

May 26 2026 7:54 AM | Updated on May 26 2026 7:54 AM

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

నిజామాబాద్‌అర్బన్‌: ఖరీఫ్‌ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో సోమవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతోపాటు ఎరువులు విత్తనాల డీలర్లు, రైస్‌ మిల్లర్లతో కలెక్టర్‌ అవగాహన సదస్సు నిర్వహించారు. ఖరీఫ్‌ పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా రైతులకు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. ముఖ్యంగా ప్రైవేట్‌ కంపెనీల ద్వారా మార్కెట్‌లో చెలామణి అయ్యే అన్ని రకాల విత్తనాలను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. ఏవోలు, ఏఈవోలు నకిలీ విత్తనాల బెడద లేకుండా తనిఖీలు నిర్వహించాలని అన్నారు. నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేయటంతోపాటు కేసులు నమోదు చేసి రికవరీ యాక్టు అమలు చేస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు. జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, డీఎస్‌వో శ్రీకాంత్‌ రెడ్డి, సివిల్‌ సప్లయ్‌ డీఎం ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement