సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. 20 రోజుల వ్యవధిలో మూడుసా ర్లు పంటలను నష్టపోవడం రైతుల పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రకృతి ప్రకోపానికి జిల్లావ్యాప్తంగా 9,460 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం 6,793 మంది రైతులకు నష్టం వాటిల్లింది. పంట చేతికి వచ్చే సమయంలో వడగళ్లతో కురిసిన అకాల వర్షం కారణంగా కలిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో అత్యధికంగా వరికి నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, మామిడి, అరటి, బొప్పాయి. కూరగాయలు తదితర పంటలు కొద్దిమేర విస్తీర్ణంలో దెబ్బతిన్నాయి. అకాల వర్షం, వడగళ్ల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఈనెల 5వ తేదీన ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
● ఈ నెల 5వ తేదీన కురిసిన అకాల వర్షం, వడగళ్లతో సిరికొండ, ధర్పల్లి, ఇందల్‌వాయి, డిచ్‌పల్లి, సాలూర మండలాల్లోని 22 గ్రామాల పరిధిలో 3,985 మంది రైతులకు చెందిన 6,088 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో అత్యధికంగా వరి 5,065 ఎకరాల్లో, మొక్కజొన్న 826 ఎకరాల్లో, మామిడి 138 ఎకరాల్లో, అరటి, కూరగాయలు 10 ఎకరాల్లో దెబ్బతిన్నాయి.
● గత నెల 31వ తేదీన కురిసిన అకాల వర్షానికి 14 మండలాల్లో 2,209 మంది రైతులకు చెందిన 2,559 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మామిడి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 95 శాతం వరి పంటే దెబ్బతినడం గమనార్హం.
మార్చి 31వ తేదీన నిజామాబాద్ మార్కెట్ యార్డులో తడిసిన పసుపు కుప్పలు
మార్చి 31న వీచిన ఈదురుగాలులకు నందిపేట
మండలం బజార్‌కొత్తూర్‌లో నేలకొరిగిన నువ్వు
దెబ్బ మీద దెబ్బ కొడుతున్న ‘అకాలం’
20 రోజుల వ్యవధిలో మూడుసార్లు
కన్నెర్రజేసిన ప్రకృతి
జిల్లావ్యాప్తంగా 9,460 ఎకరాల్లో
పంట నష్టం
అత్యధికంగా నష్టపోయింది వరి రైతులే..
ఈ నెల 18, 19 తేదీల్లో వడగళ్లతో కురిసిన అకాల వర్షం కారణంగా సిరికొండ, ధర్పల్లి, ఇందల్‌వాయి మండలాల్లో 599 మంది రైతులకు చెందిన 813 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. సిరికొండ మండలంలోని 9 గ్రామాల పరిధిలో 526 మంది రైతులకు చెందిన 691 ఎకరాల్లో, ధర్పల్లి మండలానికి చెందిన ఒక గ్రామంలో 28 మంది రైతులకు చెందిన 62 ఎకరాల్లో, ఇందల్‌యి మండలంలోని రెండు గ్రామాల్లో 45 మంది రైతులకు చెందిన 60 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది.


