ప్రధాన డిమాండ్లు..
● సంస్థ రక్షణ, డిమాండ్ల
సాధన కోసం పోరుబాట
● రేపటినుంచి సమ్మెలోకి..
● ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి.
● 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలి. 2025 వేతన సవరణ చేపట్టాలి.
● మహాలక్ష్మి డబ్బులు రూ. 400 కోట్లను నెలనెలా విడుదల చేయాలి.
● ఆర్టీసీ స్థలాలను ఈవీ బస్సుల కంపెనీలకు ఇవ్వొద్దు. ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి.
● ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి,
గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి.
● ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి.
కండక్టర్, డ్రైవర్లపై కేఎంపీఎల్, ఏపీకే
వేధింపులు మానుకోవాలి.
● 2019సమ్మె కేసులను ఎత్తేయాలి.
● రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి.
● సంస్థలో అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేయాలి.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో చాలాకాలం తర్వాత కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. ఆర్టీసీ రక్షణ, సమస్యల పరిష్కారమే ఎజెండాగా తెలంగాణ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నుంచి సమ్మెకు దిగుతున్నారు.
ఒత్తిడిలో కార్మికులు...
కామారెడ్డి డిపోలో 129 బస్సులు, బాన్సువాడ డిపోలో 94, ఆర్మూర్ డిపోలో 94 బస్సులు, బోధన్‌లో 118, నిజామాబాద్–1 డిపోలో 123, నిజమాబాద్–2 డిపోలో 89 కలిపి మొత్తంగా 647 బస్సులు నడుస్తున్నాయి. బస్సులు దాదాపు రోజూ 2.50 లక్షల కిలోమీటర్ల దూరం తిరుగుతుండగా, రూ. కోటిన్నర ఆదాయం వస్తోంది. అయితే ఖర్చులు తగ్గించుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం టిమ్స్ డ్యూటీలు పెంచుతూ ఇబ్బంది పెడుతోందని జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎనిమిది గంటలకు బదులు 12 నుంచి 16 గంటల దాకా పనిచేయిస్తున్నారని, స్పెషల్ ఆప్ కూడా ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. విరామం లేకుండా పనిచేయాల్సి రావడంతో డ్రైవర్లు, కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారంటున్నారు.
మరోవైపు బస్సుల్లో 55 మంది ప్రయాణించా ల్సి ఉండగా మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చాక వంద నుంచి 120 మంది దాకా ప్రయాణిస్తున్నారు. దీంతో కండక్టర్లతోపాటు డ్రైవర్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల డ్రైవర్లకే టికెట్ ఇచ్చే బాధ్యత ఉండడంతో వాహనం నడుపుతూ టికెట్లు ఇవ్వాల్సి రావడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిభారంతో కార్మికులు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు.


