మోర్తాడ్(బాల్కొండ): రెండో విడత రైతు భరోసా సొమ్మును రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం సోమ వారం జమ చేయనుంది. పాత విధానానికి పూర్తిగా భిన్నంగా ఈసారి రైతు భరోసా సొమ్మును విడుదల చేస్తున్నారు. గతంలో మొదటి రోజు ఒక ఎకరంలోపు వారికి, రెండో రోజు రెండు ఎకరాలలోపు వారికి, మూడో రోజు మూడు ఎకరాల వరకు అంటూ పెట్టుబడి సాయాన్ని జమ చేసేవారు. ఈసారి తొలి విడతలో ఎన్ని ఎకరాలు ఉన్నవారికై నా ఒక ఎ కరం వరకు పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేశారు. రెండో విడతలో రెండో ఎకరానికి, మూడో విడతలో మూడో ఎకరానికి అని ప్రభుత్వం వెల్లడించింది. మార్చి 23న తొలి విడత పెట్టుబడి సాయాన్ని విడుదల చేయగా, జిల్లాలోని 2,69,476 మంది రైతుల ఖాతాల్లో రూ.1,34,95,15,004 సొమ్మును జమ అయ్యింది. తొలి విడత సాయం అందించిన నెల రోజులకు రెండో విడత సొమ్మును విడుదల చేయనుండటం గమనార్హం. యాసంగి సీజన్ పంటలు చేతికి వచ్చే దశలో రైతు భరోసా సొమ్మును విడుదల చేస్తుండటంతో వచ్చే వర్షాకాలం సీజన్ ఏర్పాట్ల కోసం ఉపయోగపడుతుందని రైతులు భావిస్తున్నారు. అనేక మంది రైతులు భూసారం పెంచేందుకు నల్లమట్టి, పశువుల పేడను కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా సొమ్ము చేతికి అందుతుండటంతో కొంతైనా సద్వినియోగం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రెండో ఎకరానికి పెట్టుబడి సాయాన్ని జమ చేయనున్న ప్రభుత్వం
పాత విధానానికి భిన్నంగా సాయం
వర్షాకాలం పంటలకు
పనికొస్తుందంటున్న రైతులు


