సాహిత్య రంగంలో సాయిలు ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

సాహిత్య రంగంలో సాయిలు ప్రతిభ

Apr 20 2026 7:24 AM | Updated on Apr 20 2026 7:24 AM

వ్యవసాయంతోపాటు అక్షరసేద్యం చేస్తున్న హెగ్డోలి వాసి

రుద్రూర్‌: పోతంగల్‌ మండలం హెగ్డోలి గ్రామానికి చెందిన నాగం సాయిలు సాహిత్య రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. కీర్తిశేషులు నాగం ఆశన్న కుమారుడైన సాయిలు చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులను ఎదుర్కొని చదువును కొనసాగించారు. ఎంఏ తెలుగు, తెలుగు పండిత్‌ పూర్తి చేయగా, 2012 డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు పోస్టును తృటిలో కోల్పోయాడు. అయినప్పటికీ భాషపై ఉన్న అభిమానం తగ్గకుండా అక్షరసేద్యం కొనసాగిస్తూ వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకున్నారు. తనకున్న భూమిలో సాగు చేస్తూనే సాహిత్య సేవను కొనసాగిస్తూ ఈ తరం యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

సమాజ సమస్యలను ప్రతిబింబించేలా..

సాయిలు కవిత్వంపై ఆసక్తితో డాక్టర్‌ కాసర్ల నరేష్‌ రావు మార్గదర్శకత్వంలో సాహిత్య ప్రయాణం ప్రారంభించగా, పద్మశ్రీ డాక్టర్‌ ఎన్‌.గోపి ప్రోత్సాహంతో ‘నానీ మీగడలు’ అనే పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకాన్ని తన తండ్రి ఆశన్నకు అంకితమిచ్చారు. సమాజ సమస్యలను ప్రతిబింబించే నానీ మీగడలు పాఠకులను ఆలోచింపజేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, రహదారి భద్రత, సామాజిక బాధ్యత వంటి అంశాలపై ఆయన రాసిన నానీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ‘‘తాబేలులా హెల్మెట్‌ ధరించు’’ వంటి సందేశాత్మక పంక్తులు యువతలో చైతన్యం కలిగిస్తున్నాయి. సాహిత్య రంగంలో ఆయన చేసిన కృషికి పలువురు కవులు, పండితులు సాయిలును ‘సహజకవి’, ‘రైతుకవి’గా అభివర్ణించారు. ఇందూరు జంట కవులు కందాలై రాఘవాచార్యులు, చందనరావు వంటి ప్రముఖులు ఆయనను ‘ఈ తరం పోతన’గా కొనియాడడం విశేషం. కరోనా కాలంలో కూడా సామాజిక బాధ్యతను ప్రతిబింబించే కవితలు రచించిన సాయిలు, ‘మా నాన్న’, ‘కరోనాకాలంలో నా మిత్రుని సేవ’, ‘మానవత్వం పరిమళించింది’ వంటి కవితలతో పాఠకులను కదిలించారు. వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, రైతుల సేవలను ప్రశంసిస్తూ రాసిన కవితలు పలువురు అభిమానులను సంపాదించాయి.ఇప్పటివరకు పలు కవి సమ్మేళనాల్లో పాల్గొని ప్రశంసలను నాగం సాయిలు అందుకున్నారు. భవిష్యత్‌లో మరిన్ని కవితలు రచించి గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశానికి పేరు తీసుకురావాలని సాహిత్యాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement