ధర్పల్లి: మండల కేంద్రం శివారులోని రైతు మామిడి లక్ష్మణ్, రాజశేఖర్ చెందిన వ్యవసాయ చేనులోని డ్రిప్పు పైపులు, ఎరువులు ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయి. ఆదివారం పొలాల సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌కు మంటలు చెలరేగగా, పక్కనే ఉన్న మొక్కజొన్న సొప్పకు మంటలు అంటుకొని కాలిపోయాయి. భారీ గాలులు వీచడంతో మంటలు వ్యాపించి, లక్ష్మణ్ చేనులోని డ్రిప్ పైపులతోపాటు ఐదు ట్రాక్టర్ల పశువుల ఎరువు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్‌తో సిబ్బంది మంటలను ఆర్పారు. సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు.
టిప్పర్ క్యాబిన్‌లో మంటలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎన్‌హెచ్ 765డి రోడ్డు పనులు చేపడుతున్న కేపీసీకి చెందిన ఓ టిప్పర్ క్యాబిన్‌లో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం మండలంలోని బంజారతండా వద్ద చోటుచేసుకుంది. రోడ్డు పనుల్లో భాగంగా మొరం తీసుకెళ్తున్న టిప్పర్ బంజారతండా వద్దకు చేరుకోగానే క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ గుర్తించి టిప్పర్‌ను రోడ్డుపక్కన నిలిపి, కిందికి దిగిపోయాడు. మంటలను గమనించిన తండా సర్పంచ్ సురేష్ జీపీ ట్యాంకర్‌ను తెప్పించి మంటలను అదుపుచేశారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి అగ్నిమాపకకేంద్రం ఫైర్‌ఇన్‌స్పెక్టర్ వినోద్ ఫైరింజన్‌తో ఘటనస్థలానికి చేరుకొని టిప్పర్‌లోని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఘటనాస్థలంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎస్సై భార్గవ్‌గౌడ్ తన సిబ్బందితో కలిసి రాకపోకలను పునరుద్ధరించారు.
నవీపేట: మండలంలోని బినోల గ్రామంలోని తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామంలోని అయిటి నర్సు శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి, తన కుటుంబసభ్యులతో కలిసి ఇంటి దాబాపై నిద్రించారు. ఉదయం లేచిచూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.5వేల నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


