గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని పోతంగల్ కలాన్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన గొల్లపల్లి కిష్టయ్య(62) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈనెల 16న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల వద్ద వెతికినా ఆచూకీ తెలియ లేదు. గ్రామ శివారులోని మామిడి విఠల్‌కు చెందిన పొలం వద్ద మంచెకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విఠల్ పొలాన్ని అదే గ్రామానికి చెందిన గైని రాములు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఆదివారం ఉదయం అతడు పొలం వద్దకు వెళ్లగా మంచెకు కిష్టయ్య ఉరివేసుకున్నట్లు గుర్తించాడు. వెంటనే మృతుడి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య అంజవ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
వేల్పూర్: మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో వనందాస్ మహేందర్‌గౌడ్, శ్రావణ్‌కుమార్‌గౌడ్‌లకు చెందిన ద్విచక్రవాహనాలను శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. బాధితులు ఎప్పటిలాగే తమ వాహనాలను రాత్రి ఇంటివద్ద ఉంచి నిద్రించగా, గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో కాలిపోయినట్లు పేర్కొన్నారు. శ్రావణ్‌కుమార్‌గౌడ్‌కు చెందిన స్కూటీ, మహేందర్‌గౌడ్‌కు చెందిన బైక్ కాలిపోవడంతో సుమారు రూ.లక్ష 40వేల నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. ఘటనపై వేల్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు.


