● సీపీ సాయిచైతన్య
● ఎడపల్లిలో ‘అరైవ్–అలైవ్’ నిర్వహణ
బోధన్: రోడ్డు ప్రమాదాలు తగ్గించడం, భద్రతావ్యవస్థల బలోపేతం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం అరైవ్ అలైవ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సీపీ సాయి చైతన్య అన్నారు. ప్రస్తుతం ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల కారణంగానే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్‌శాఖ అధ్వర్యంలో శనివారం ఎడపల్లిలో ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రాఫిక్ నియమాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన ప్రజలు, వాహనదారులనుద్దేశించి మాట్లాడారు. జిల్లాలో ట్రాఫిక్ నియమాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, జాగ్రత్తలపై తమ శాఖ అధికారులు ప్రజలు, వాహనదారుల్లో విస్త్రృత స్థాయిలో ఈ నెల 13 నుంచి శనివారం వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు డ్రైవింగ్ చేసి తమతో పాటు ఇతరుల ప్రాణాలు కాపాడాలన్నారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయన్నారు. కోవిడ్ సమయంలో జిల్లాలో సుమారు 200 మంది చనిపోతే 2025 ఏడాదిలో రోడ్డు ప్రమాదాల్లో 302 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌లో అట్టి ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించే వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సహించుటకు రహవీర్ పథకం కింద రూ.25 వేల అందించనున్నట్లు పేర్కొన్నారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయబాబు, ఎంవీఐ శ్రీనివాస్, ఎస్సై శ్రీరామ, మచ్చేంధర్ రెడ్డి, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.


