క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Apr 19 2026 7:23 AM | Updated on Apr 19 2026 7:23 AM

అదృశ్యమైన యువకుడు.. శవమై తేలాడు గోధుమల లారీ బోల్తా

చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

ఎల్లారెడ్డి: నిజాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. వివరాలు ఇలా.. ఎల్లారెడ్డి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన మాటూరి మల్లేష్‌(33), తన మిత్రుడు సాయితో కలిసి శనివారం రుద్రారం గ్రామశివారులోని నిజాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లాడు. కాగా చేపలు పట్టేక్రమంలో మల్లేష్‌ వలను పట్టుకొని మరో గట్టుకు వెళ్తుండగా వల కాళ్లకు చుట్టుపోయింది. దీంతో అతడు ఈత కొట్టలేక నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడి భార్య సౌజన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నవీపేట: అదృశ్యమైన ఓ యువకుడు గోదావరి నదిలో శవమై తేలాడు. ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాలు ఇలా.. నిర్మల్‌ జిల్లా ముధోల్‌ మండలం చించాలం గ్రామానికి చెందిన గట్టుపల్లి రంజిత్‌ (36) కొన్నేళ్లుగా నిజామాబాద్‌ జిల్లా బోర్గాం వద్ద గల ఐసీడీఎస్‌ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నాడు. వచ్చే నెల 8న అతడికి వివాహం జరగాల్సి ఉంది. ఈనెల 15న అతడు భీంగల్‌లోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి బైక్‌పై వెళ్లాడు. మళ్లీ తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువుల ఇళ్లలో కుటుంబ సభ్యులు వాకబు చేశారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో ముధోల్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదైంది. శనివారం ఉదయం గోదావరి నదిలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రంజిత్‌ మృతదేహంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. యువకుని మృతికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

ఇందల్వాయి: ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద గోధుమల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తాపడింది. వివరాలు ఇలా.. జబల్పూర్‌ నుంచి గోదుమల లారీ బెంగళూరుకు బయలుదేరింది. శనివారం ఉదయం ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగా, ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఘటన సమయంలో లారీ డ్రైవర్‌ బయటకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటన స్థలానికి చేరుకున్న టోల్‌ప్లాజా సిబ్బంది గోధుమల బస్తాలను మరో లారీని రప్పించి లోడ్‌ చేశారు. అనంతరం దెబ్బతిన్న లారీ పక్కకు తొలగించారు.

Advertisement
 
Advertisement
Advertisement