పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా..
అన్నింటిని పరిశీలించాలి
మోర్తాడ్(బాల్కొండ): నకిలీ ట్రావెల్ ఏజెన్సీలు, ఏజెంట్లతో నిరుద్యోగులు మోసపోవడంతోపాటు ఆర్థికంగా నష్టపోతున్నా ప్రభుత్వం వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతుంది. నకిలీ ఏజెంట్లు, సంస్థలు ఇచ్చే వీసాల వల్ల కొంతమంది విదేశాలకు వెళుతున్నా అక్కడకు వెళ్లిన తరువాత సమస్య ఉత్పన్నమైతే పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో విదేశాలకు వెళ్లే వారికంటే మోసపోతున్న వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది.
రూ.కోట్లు కొల్లగొడుతూ..
కరోనా విపత్కర పరిస్థితుల తరువాత గల్ఫ్ దేశాలకు వలస వెళ్లడానికి యువత అంతగా ఆసక్తి చూపడం లేదు. యూరప్ దేశాలు, దక్షిణాసియా దేశాలకు వలస వెళ్లాలానుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో కొన్ని ఏజెన్సీలు (లైసెన్స్ లేని సంస్థలు) తాము యూరప్ ఇతర దేశాలకు వీసాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టాయి. మెట్‌పల్లి కేంద్రంగా పని చేసిన ఒక నకిలీ సంస్థ రూ.1.50 కోట్లకు, నిర్మల్ జిల్లాలోని ముగ్గురు నకిలీ ఏజెంట్లు అర్మెనియా, మాల్టా దేశాలకు పంపిస్తామని చెప్పి రూ.3.50 కోట్లకు కుచ్చుటోపి పెట్టారు. జగిత్యాల్ కేంద్రంగా ముగ్గురు ఏజెంట్లు రూ.6 కోట్ల వరకూ నిరుద్యోగుల నుంచి వసూలు చేసి ఉడాయించారు. ఇలా కోట్లాది రూపాయలు దండుకుని నిరుద్యోగులను ముంచుతున్న నకిలీ ఏజెన్సీలపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇమిగ్రేషన్ చట్టంలో ఉన్న లొసుగుల వల్ల నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిరుద్యోగులను అధిక మొత్తంలో మోసగించిన ఒక ఏజెంట్‌పై జగిత్యాల్ అధికార యంత్రాంగం పీడీ యాక్టును అమలు చేసినా నకిలీల ఆటలు ఇంకా సాగుతున్నాయి అంటే కఠినమైన చర్యలు లేకపోవడమే కారణం అని స్పష్టమైతుంది. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నకిలీ ఏజెంట్లు, సంస్థల వల్ల మోసపోతున్న వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
మన విదేశాంగ శాఖ ఆధ్వర్యంలోని ఈమైగ్రెంట్ వెబ్‌పోర్టల్‌లో నమోదైన లైసెన్స్ ఏజెన్సీలు, బ్రాంచీల సంఖ్య రాష్ట్రంలో 124 మాత్రమే ఉంది. ఈ ఏజెన్సీల ద్వారానే గల్ఫ్ ఇతర దేశాలకు వలస వెళ్లేవారికి వీసాల జారీ ప్రక్రియ చట్టబద్ధంగా సాగుతుంది. గల్ఫ్‌తో పాటు ఇతర దేశాలకు వలసలు ఎక్కువగా ఉన్న మన జిల్లాతోపాటు పొరుగు జిల్లాల్లో లైసెన్స్‌డ్ ఉన్న ట్రావెల్స్ ఏజెన్సీలు, బ్రాంచీల సంఖ్య పరిమితంగా ఉండగా నకిలీ సంస్థల జాబితా వేలల్లో ఉంది. నకిలీ ఏజెంట్లు, వారి ఏజెన్సీలు పుట్టగొడుగుల్లా పుట్టుక వస్తున్నా మోసాలకు చెక్ పెట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విదేశాలకు వెళ్లడానికి వీసాల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఏజెంట్లు నకిలీలా లేదా అని పరిశీలించుకోవాలి. లైసెన్స్ ఉన్న ఏజెన్సీల వల్లనే చట్టబద్ధమైన ప్రయాణం సాధ్యమవుతుంది. నకిలీ ఏ జెంట్లు,సంస్థలను ఆశ్రయించకపోవడమే మంచిది.
– పొన్నం సత్యనారాయణ, సీఐ, భీమ్‌గల్
రాష్ట్రంలో వేల సంఖ్యలో
నకిలీ ట్రావెల్ ఏజెన్సీలు
లైసెన్స్ ఉన్నవి కేవలం 124
నకిలీ ఏజెంట్లు, సంస్థల వల్ల
మోసపోతున్న నిరుద్యోగులు


