పీఎంతో వర్చువల్‌ భేటీలో పాల్గొన్న విద్యార్థి | - | Sakshi
Sakshi News home page

పీఎంతో వర్చువల్‌ భేటీలో పాల్గొన్న విద్యార్థి

Apr 18 2026 9:17 AM | Updated on Apr 18 2026 9:17 AM

పీఎంతో వర్చువల్‌ భేటీలో పాల్గొన్న విద్యార్థి ఢిల్లీ పర్యటనలో రూరల్‌ ఎమ్మెల్యే మైక్రోసాఫ్ట్‌లో కొలువు సాధించిన ఆలూర్‌ యువకుడు నూత్‌పల్లిలో ప్లాస్టిక్‌ నిషేధం

రుద్రూర్‌: మండలంలోని ఆహార శాస్త్ర సాంకేతిక కళాశాలలో రెండో సంవత్సరం చదువుతు న్న విద్యార్థిని శ్రావ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వర్చువల్‌గా భేటీ అయ్యింది. ‘మై భా రత్‌ బడ్జెట్‌–2026’ అంశంపై మూడు దశలుగా నిర్వహించిన వర్చువల్‌ పోటీలలో పాల్గొన్న శ్రావ్య ప్రతిభ కనబర్చి ఎంపికైంది. ఈనెల 12, 13 తేదీల్లో హైదరాబాద్‌లోని కన్నశాంతి వనంలో నిర్వహించిన జాతీయ స్థాయి ‘వర్చువల్‌ డైలాగ్‌ విత్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ కార్యక్రమంలో శ్రావ్య పాల్గొందని కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు. పీఎంతో వర్చువల్‌ భేటీలో పాల్గొన్న శ్రావ్యను అధ్యాపకులు, సహ విద్యార్థులు అభినందించారు.

నిజామాబాద్‌ రూరల్‌: రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం సీఎం రేవంత్‌రె డ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాల పై చర్చించారు. అనంతరం ఢిల్లీలోని యము నా నది ఒడ్డున గల జాతిపిత మహాత్మాగాంధీ రాజ్‌ఘాట్‌ను రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి, మైనింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌, మాజీ ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ మునిపల్లి సాయిరెడ్డితో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా మహాత్ముడిని స్మరించుకొని నివాళులు అర్పించారు.

పెర్కిట్‌(ఆర్మూర్‌): ఆలూర్‌ మండల కేంద్రానికి చెందిన జల్లాపురం వినేష్‌రెడ్డి అమెరికాలోని మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో కొలువు సాధించాడు. ఆలూర్‌కు చెందిన జల్లాపురం అశోక్‌ రెడ్డి, భోజకళ రైతు దంపతులకు కూతురు నిఖిత, తర్వాత కవలలు వినీత్‌ రెడ్డి, వినేష్‌రెడ్డి కుమారులు ఉన్నారు. కూతరు నిఖితతో పాటు అల్లుడు, కవలల్లో ఒకరైన వినీత్‌ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. కవలల్లో మరొకరైన వినేష్‌ రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడే ఎంఎస్‌ పూర్తి చేసి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుండగానే భారీ ప్యాకేజితో మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. గ్రామీణ రైతు కుటుంబం నుంచి కష్టపడి చదివి ఏడాదికి రూ.కోటి 27 లక్షల ప్యాకేజితో కొలువు సాధించడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీ తీర్మానం

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధిస్తూ డొంకేశ్వర్‌ మండలం నూత్‌పల్లి గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం జీపీ తీర్మానం చేసింది. ప్లాస్టిక్‌ వినియోగంతో ప్రజలు క్యాన్సర్‌ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారని సర్పంచ్‌ సురకంటి రాజారెడ్డి అన్నారు. ఊరి ప్రజలను ప్లాస్టిక్‌ నుంచి విముక్తి కల్పించడానికి పాలకవర్గ సభ్యులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఐతే, పెళ్లిళ్లు, ఇతర కార్యాలకు ప్లాస్టిక్‌ ఇస్తార్లు, గ్లాసులు వినియోగించకుండా జీపీ నుంచి 600 స్టీల్‌ ప్లేట్లు, 400 గ్లాసులను కొనుగోలు చేశారు. వీటిని గ్రామ ప్రజలు ఉచితంగా తీసుకెళ్లి మళ్లీ తిరిగి ఇచ్చేలా పంచాయతీ అవగాహన కల్పిస్తోంది. దుకాణాలు, హోటళ్లలో కూడా ప్లాస్టిక్‌ను వాడకూడదని సూచించారు. ఈ నిర్ణయాన్ని మే 1 నుంచి వందశాతం అమలు చేయాల్సిందేనన్నారు. జీపీ నిర్ణయంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement