డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ నర్సరీల సంరక్షణపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నర్సరీల తాజా పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ప్రతి ఒక్క నర్సరీ ఫొటోను ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా జిల్లా కార్యాలయానికి తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. 44 డిగ్రీల ఎండలకు నర్సరీలో పెరుగుతున్న మొక్కలు వాడి, ఎండిపోకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని డీఆర్డీవో సాయన్న ఉపాధిహామీ ఉద్యోగులకు ఆదేశాలు జారీచేశారు. ఇందుకోసం మొక్కలకు నీడ ఉండేలా గ్రామ పంచాయతీల నిధులతో షేడ్ నెట్లు కొనుగోలు చేసి ఏర్పాటు చేయాలని సూచించారు. రోజుకు మూడు పూటలా నీళ్లు తప్పకుండా పట్టాలని, నిర్లక్ష్యం చేయొద్దని స్పష్టం చేశారు.
13.78 లక్షల మొక్కలు..
జిల్లాలో ఈ ఏడాది నిర్వహించే వనమహోత్సవ కార్యక్రమానికి 530 గ్రామ పంచాయతీ నర్సరీల్లో పాత మొక్కలు కాకుండా 13.78 లక్షల మొక్కలను పెంచుతున్నారు. వేసవి నేపథ్యంలో తగినంత నీడ, నీళ్లు లేకపోయినా మొక్కలు ఎండిపోయే అవకాశం ఉంది. వేసిన విత్తనాలు కూడా విఫలం అయ్యే ఆస్కారం ఉంది.
ఈ నేపథ్యంలో నర్సరీలను ఎండల నుంచి గట్టెక్కించడానికి డీఆర్డీవో స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎంపీడీవోలు, ఏపీవోలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులను అలర్ట్ చేశారు. షేడ్ నెట్లు లేనిచోట వెంటనే ఏర్పాటు చేయించాలని సూచించారు. దీంతో ఉపాధి ఉద్యోగులంతా ఇప్పుడే ఇదే పనిలో బీజీగా ఉన్నారు.
తక్షణ చర్యలు చేపడుతున్నాం..
ఎండల తీవ్రతకు నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలు ఎండిపోయే అవకాశం ఉంది. అందుకే తక్షణ చర్యల కింద ప్రతి నర్సరీలో మొక్కలకు షేడ్ నెట్లు ఏర్పాటు చేసి మూడు పూటలా నీళ్లు పట్టించాలని ఆదేశాలిచ్చాం. ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేసినా ఉపేక్షించేది లేదని స్పష్టంగా చెప్పాం.
– సాయన్న, డీఆర్డీవో, నిజామాబాద్
ఎండల తీవ్రత దృష్ట్యా షేడ్ నెట్ల ఏర్పాటుకు చర్యలు
మొక్కలకు మూడు పూటలా
నీళ్లు పట్టాలని ఆదేశాలు
నర్సరీల పరిస్థితిపై ఫొటోలు
తెప్పించుకున్న డీఆర్డీవో


