ప్రతి ఇంటికి శుద్ధ జలాలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటికి శుద్ధ జలాలు అందించాలి

Apr 18 2026 7:23 AM | Updated on Apr 18 2026 7:23 AM

తాగునీటి సరఫరాను

నిరంతరం పర్యవేక్షించాలి

అధికారులకు కలెక్టర్‌

ఇలా త్రిపాఠి ఆదేశం

ఆర్మూర్‌: వేసవికాలం నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి ఇంటికి శుద్ధజలాలు సరఫరా అయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆర్మూర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని డొంకేశ్వర్‌, నందిపేట్‌, మాక్లూర్‌, ఆలూర్‌, ఆర్మూర్‌ మండలాల ఎంపీడీవోలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈలు, ఎంపీవోలు, ఆర్మూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఇతర అధికారులతో తాగునీటి సరఫరా తీరుతెన్నులపై కలెక్టర్‌ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా నీటి సరఫరా పరిస్థితి, అందుబాటు లో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సిన మరమ్మతు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో సరిపడా వర్షాలు కురిసే అవ కాశాలు లేవని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నందున తాగునీటి వనరులను సమర్ధవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలన్నారు. చుక్క నీరు కూడా వృథా కాకుండా చూడాలన్నారు. ఇబ్బందులుంటే ముందుగానే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నా రు. వేసవిలో జిల్లాలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి నెలకొనకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడైనా నీటి కోసం ప్రజలు నిరసనకు ది గితే సంబంధిత ఎంపీడీవోలను బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. చేతి పంపులు, బోరు బావులకు తక్షణమే ఫ్లషింగ్‌ చేయించాలని అన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థకు ఆటంకం కలిగేలా పైప్‌లైన్లను ధ్వంసం చేయడం, వాల్వ్‌లకు నష్టం చేకూర్చే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని, అలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. తాగునీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని, ఎంపీవోలు, ఏఈలు నిరంతర పర్య వేక్షణ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆ ర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మాల్వియా, జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌, డీఆర్డీవో సాయన్న, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రాజేందర్‌, డీపీవో శ్రీనివాస్‌ రావు, మున్సిపల్‌ కమిషనర్‌ ఉమా మహేశ్వర్‌, మిషన్‌ భగీరథ ఈఈ రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement