కోఆప్షన్‌ పదవులకు గ్రీన్‌సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

కోఆప్షన్‌ పదవులకు గ్రీన్‌సిగ్నల్‌

Apr 18 2026 7:23 AM | Updated on Apr 18 2026 7:23 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నగరపాలక, పురపాలకాల్లో కోఆప్షన్‌ పదవుల ఎన్నికకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదట నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కోఆప్షన్‌ పదవుల ఎంపిక కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. 21 సంవత్సరాల వయస్సు ఉండి నగరపాలకం పరిధిలో ఓటరుగా నమోదై ఉన్న వ్యక్తులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. గతంలో కార్పొరేటర్లుగా పనిచేసినవాళ్లు, నగరపాలకం పరిధిలో న్యాయవాదిగా పనిచేసినవాళ్లు, కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల్లో గెజిటెడ్‌ ఉద్యోగిగా పనిచేసి రిటైర్‌ అయి, పురపాలన, నగరపాలనలో అనుభవం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

పురపాలకాల్లో ముగ్గురు..

బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లోనూ కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోనున్నారు. కౌన్సిల్‌ ఏర్పాటయ్యాక 90 రోజుల్లోపు కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. దీంతో త్వరలో ఈ మూడు మున్సిపాలిటీల్లోనూ కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకునేందుకు రంగం సిద్ధం చేయనున్నారు. ఈ మూడు పురపాలకాల్లో ముగ్గురు కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఒకరు కచ్చితంగా మహిళ ఉండాలి. మరొకరు మైనారిటీ మతాల నుంచి ఉండాల్సి ఉంది. వీటి కోసం పలువురు ఎదురుచూస్తున్నారు.

ఐదుగురు సభ్యులు..

నిజామాబాద్‌ నగరపాలక సంస్థలో ఐదుగురు కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఐదుగురిలో ముగ్గురు సాధారణం కాగా, మైనారిటీ వర్గాలైన ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు, బౌద్ధ, పార్శీ మతాలకు చెందినవారు కచ్చితంగా ఇద్దరు ఉండాలి. రెండు విభాగాల్లోనూ ఒక మహిళ ఉండాలి. ఈ నెల 21వ తేదీలోగా సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేకంగా కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని చేతులు ఎత్తడం ద్వారా తీసుకొని ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ తెలిపారు.

ఇందూరు నగరపాలకంలో

మొదలైన ప్రక్రియ

బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌

బల్దియాల్లోనూ త్వరలో

నోటిఫికేషన్‌

Advertisement
 
Advertisement
Advertisement