ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
వేల్పూర్: రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీసూర్య తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నా రు. గురువారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సాధనలో అమరుల త్యాగాలను అవమానించేలా బిజేపీ ఎంపీ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. రాజ్యాంగబద్దంగా చట్టాలకు లోబడి పార్లమెంటు ప్రక్రియ ద్వారా ఒక రాష్ట్రం ఏర్పడడాన్ని దేశ విభజనతో ముడిపెట్టి, శత్రుదేశమైన పాకిస్తాన్‌తో పోల్చడం క్షమించరాని నేరమని, దేశద్రోహానికి సమానమని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు అదే తరహాలో ఉంటే విభజన బిల్లుకు అప్పట్లో బీజేపీ ఎందుకు మద్దతు తెలిపిందని ప్రశ్నించారు. సభలో తెలంగాణ నుంచి 8 బీజే పీ, 8 కాంగ్రెస్ ఎంపీలు దిష్టిబొమ్మల్లా మిగిలారని ఆరోపించారు. సభలో బీఆర్‌ఎస్ ఎంపీలు ఉండి ఉంటే తేజస్వీసూర్యకు తగిన గుణపాఠం చెప్పేవారన్నారు. రాజ్యాంగబద్దంగా ఏర్పడిన తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుండడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందని చెప్పారు. ఎంపీ సూర్య తేజస్వీ వెంటనే తెలంగాణ ప్రజలకు, పార్లమెంటుకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


