అర్హులందరికీ సంక్షేమ పథకాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

Apr 17 2026 10:50 AM | Updated on Apr 17 2026 10:50 AM

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

సిరికొండలో ప్రజాపాలన–ప్రగతి

ప్రణాళిక మండల స్థాయి సభ

సిరికొండ: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మండల స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలు చేస్తోందన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 గ్యాస్‌ సిలిండర్‌, గృహజ్యోతి తదితర పథకాలను అమలు చేస్తున్నదని వివరించారు. ప్రభుత్వం కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేయనుందన్నారు. యంత్రలక్ష్మిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు లాభదాయకంగా ఉండేలా ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌పీవో)లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తు సేద్యంలో ప్రగతి సాధించాలని కోరారు.

పసుపు రైతులకు మేలు చేకూర్చడమే ధ్యేయం

పసుపు రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ వారికి మేలు చేకూర్చడమే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కలెక్టర్‌ తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర లభించాలనే ఉద్దేశంతోనే మార్కెట్‌ యార్డులో పసుపు అమ్మకాలలో బహిరంగ వేలం విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని తెలిపారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌ మాట్లాడుతూ లొంక రోడ్డులో వంతెనల నిర్మాణాలకు అటవీ శాఖ అనుమతి ఇప్పించాలని కలెక్టర్‌ను కోరారు. భారీ వర్షాలకు ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేయించాలని, సిరికొండ ప్రభుత్వ పాఠశాలలో మూడు అదనపు గదులు మంజూరు చేయాలని తెలిపారు. మండల ప్రత్యేకాధికారి నాగోరావు, ఎంపీడీవో కేఆర్‌ మనోహర్‌రెడ్డి, తహసీల్దార్‌ రవీందర్‌రావు, సర్పంచులు, ఏఈలు, ఐకేపీ ఏపీఎం, సీసీలు, మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement