● సీపీ సాయిచైతన్య
● అంబులెన్స్, ఆటో డ్రైవర్లకు అవగాహన
నిజామాబాద్‌అర్బన్: ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలోని రైల్వేస్టేషన్ ఆవరణలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాలికలో భాగంగా గురువారం అంబులెన్స్, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వీటిని నివారించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలకు అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా వాహనం నడిపితే ఇతరుల ప్రాణాలను కూడా కాపాడిన అవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు. నిజామాబాద్ ఇన్‌చార్జి ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ట్రాఫిక్ ఆర్‌ఐ వినోద్, ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
అరైవ్–అలైవ్‌ను విజయవంతంగా నిర్వహించాలి
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించాలని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. కమిషనర్ కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యతగా తీసుకొని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కేసుల దర్యాప్తునకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లను గుర్తించాలన్నారు. నిత్యం డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేయాలని సిబ్బందికి సూచించారు.


