ఖాళీగా పోస్టులు.. కర్షకులకు పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఖాళీగా పోస్టులు.. కర్షకులకు పాట్లు

Apr 17 2026 10:50 AM | Updated on Apr 17 2026 10:50 AM

మోర్తాడ్‌: వ్యవసాయమే ప్రధానమైన బాల్కొండ నియోజవర్గంలో మూడు కీలకమైన పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా వ్యవసాయ శాఖ బోసిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భీమ్‌గల్‌ సబ్‌ డివిజన్‌ ఏడీఏ పోస్టుతోపాటు కమ్మర్‌పల్లి, భీమ్‌గల్‌ వ్యవసాయాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ పనిచేసిన ఏడీఏ మల్లయ్య బదిలీ కావడంతో స్థానంలో బాధ్యతలను స్వీకరించిన శ్రీనివాస్‌రావు కొన్ని నెలలకే సెలవుపై వెళ్లారు. ఆ తర్వాత మరో అధికారికి పోస్టింగ్‌ ఇచ్చినా ఆయన ఇక్కడ బాధ్యతలను స్వీకరించకపోవడం గమనార్హం. మరోవైపు కమ్మర్‌పల్లి, భీమ్‌గల్‌ వ్యవసాయాధికారులుగా పని చేసిన ఇద్దరు ఉద్యోగులను కొన్ని కారణాలతో సస్పెండ్‌ చేశారు. ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండటంతో పూర్తిస్థాయి వ్యవసాయాధికారులను నియమించలేదు. దీంతో బాల్కొండ వ్యవసాయాధికారి లావణ్యకు ఏడీఏగా, ఏవోగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆమె ఏవోగా, ఇన్‌చార్జీ ఏడీఏగా, ఏవోగా మూడు రకాల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కమ్మర్‌పల్లి ఏవోగా సీడ్‌ టెస్టింగ్‌ అధికారి రమ్య అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో రైతులు ప్రధానంగా ఆహార పంటలతోపాటు వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. అనేక మంది రైతులు రెండు సీజనులలో మూడు రకాల పంటలను సాగు చేస్తున్నారు. వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యం ఉన్న ఇక్కడ కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండటంతో రైతులకు సేవలు అందించడంలో కొంత అంతరాయం ఏర్పడుతోంది.

బోసిపోతున్న వ్యవసాయ శాఖ

భీమ్‌గల్‌ సబ్‌ డివిజన్‌లో ఏడీఏ పోస్టుతోపాటు రెండు ఏవో పోస్టులు ఖాళీ

కీలక పోస్టులను ఇన్‌చార్జీలతోనే

నెట్టుకొస్తున్న వైనం

Advertisement
 
Advertisement
Advertisement