సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలతో పోలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఎక్కువ ఎత్తులో ఉండడంతో సూర్య కిరణాలు నిట్టనిలువుగా భూమిని తాకుతాయి. ఉత్తర తెలంగాణలో గత వారం రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలోని భీమ్‌గల్‌లో 43.5 డిగ్రీలు, సరిహద్దులోని నిర్మల్ జిల్లా తానూరులోనూ 43.5 డిగ్రీలు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరులో 43.4 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా భీమారంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవి ప్రారంభం నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడం గమనార్హం. ఈ నెల 12వ తేదీన భీమ్‌గల్‌లో 39.11 డిగ్రీలు, 14న ఆలూరు మండలం మచ్చర్లలో 43.2 డిగ్రీలు, 15న 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉష్ణోగ్రతను పెంచుతున్న పొడిగాలులు
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడానికి భౌగోళిక కారణాలు సైతం ఉన్నాయి. ఈ ప్రాంతాలు సముద్ర తీరానికి దూరంగా ఉండడంతో ఇక్కడ ‘టోపికల్ సవన్నా’ (అధిక ఉష్ణోగ్రతలు, స్పష్టమైన వర్షాకాలం) వాతావరణం ఉంటుంది. సముద్రపు గాలుల ప్రభావం లేకపోవడంతో వేడి తీవ్రత నేరుగా ఉంటుంది. దీంతో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలు అత్యధికంగా వేడి గాలుల ప్రభావానికి లోనవుతున్నాయి. ఈ ప్రాంతం మీదుగా వీచే పొడిగాలులు ఉష్ణోగ్రతను పెంచుతాయి.
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం దేశంలోనే అత్యంత వేడి ప్రాంతాల్లో ఒకటి. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు విదర్భ ప్రాంతానికి సరిహద్దుల్లో ఉండడంతో అక్కడి నుంచి వీచే పొడి, వేడి గాలులు జిల్లాపై ప్రభావం చూపుతున్నాయి. పైగా వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళంలో కర్కాటక రేఖకు దగ్గరగా ఉంటా డు. ఉత్తర తెలంగాణ భౌగోళికంగా ఆ అక్షంశాల కు దగ్గరగా ఉండడంతో సూర్య కిరణాలు నిలువు గా పడి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అడవుల శాతం తగ్గడం, భవనాలు, రోడ్లు వంటి కాంక్రీట్ నిర్మాణాలు ఎక్కువగా ఉండ డంతో వేడి తీవ్రత పెరుగుతోంది. పైగా నల్లరేగడి, రాతినేలలు ఎక్కువగా ఉండడంతో పగటిపూట పీల్చుకున్న వేడి రాత్రి వేళ్లలో బయటకు వస్తోంది. మరోవైపు కొన్నేళ్లుగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రభావం సైతం ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2నుంచి 3డిగ్రీలు ఎక్కువ పెరిగేందుకు కారణమవుతున్నాయి.
విదర్భ వేడి సైతం ఉత్తర తెలంగాణపై..
నల్లరేగడి, రాతినేలలు పీల్చుకున్న వేడితో
రాత్రి సమయాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు
ఉత్తర తెలంగాణ కర్కాటక రేఖకు దగ్గరగా
ఉండడమూ కారణమే
గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా భీమ్‌గల్,
తానూరు ప్రాంతాల్లో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు


