ఉపాధికి హాజరు తంటాలు | - | Sakshi
Sakshi News home page

ఉపాధికి హాజరు తంటాలు

Apr 17 2026 10:26 AM | Updated on Apr 17 2026 10:26 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌) : ఉపాధిహామీ పథకంలో (వీబీ జీ రామ్‌జీ) పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం’ యాప్‌ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కూలీలకు శాపంగా మారింది. తాజాగా అమల్లోకి వచ్చిన ముఖ ఆధారిత హాజరు విధానం అనేక సాంకేతిక ఇబ్బందులకు దారితీస్తోంది. కూలీలు గడ్డం పెంచుకున్నా, గుండు గీసుకున్నా, వయస్సు ప్రభావంతో ముఖంలో వచ్చే మార్పుల వల్ల ‘యాప్‌’ వారిని గుర్తించడం లేదు. కూలీల హాజరును నమోదు చే సేందుకు ఫీల్డ్‌ అసిస్టెంట్లు అనేక తంటాలు పడుతున్నారు. మూడేళ్ల కిందటి వరకు ఉపాధిహామీ పనులకు వస్తున్న కూలీల హాజరును మస్టర్లలో ఎంట్రీ చేసే వారు. స్మార్ట్‌ ఫోన్‌లలో ఫొటో విధానం ఉండేది కాదు. హాజరు విధానాన్ని పటిష్టం చేయడానికి కేంద్రం ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌ను తీసుకొచ్చింది. రెండు నెలల కిందటి వరకు కేవలం గ్రూప్‌ సభ్యుల ఫొటోను క్యాప్చర్‌ చేస్తే సరిపోయేది. అయితే మరింత పారదర్శకత కోసం పనికి వచ్చిన ప్రతి ఒక్కరి ఫొటోను నమోదు చేయాలనే నిబంధనను తీసుకొచ్చింది. ఇందుకోసం కూలీలందరి ఆధార్‌ను అనుసంధానం చేసి కేవైసీ చేశారు. గతంలో తీసుకున్న ఫొటో, కనుపాపల ఆధారంగా కూలీల హాజరును స్కాన్‌ చేసి తీసుకుంటున్నారు. ప్రస్తుతం కూలీల వయసు పెరిగి ముఖ కవళికలు కొద్దిగా మారాయి. గడ్డం పెంచినా, గుండు ఉన్నా, కళ్లలో మార్పులు వచ్చినా యాప్‌లో ‘మిస్‌ మ్యాచ్‌’ అని చూపిస్తోంది. వెలుతురు సరిగ్గా లేకపోయినా, నీడ పడినా, నెట్‌వర్క్‌ లేకపోయినా, ఫీల్ట్‌ అసిస్టెంట్ల సెల్‌ఫోన్‌ కెమె రా క్లారిటీ లేకపోయినా కూలీల హాజరు నమోదుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. కూలీల హాజరు నమోదు కాకపోతే ఆ రోజు వారు ఇంటికి వెళ్లాల్సిందేనని ఫీల్ట్‌ అసిస్టెంట్లు పేర్కొంటున్నారు.

రెండో ఫొటో కోసం నాలుగు గంటలు

మొబైల్‌ యాప్‌లో కూలీల హాజరును రెండు సార్లు నమోదు చేస్తున్నారు. మొదటి ఫొటోను కూలీలు ఉదయం పనికి వచ్చిన వెంటనే ఒక్కొక్కరిగా తీస్తున్నారు. అప్పుడే పని మొదలు పెడుతున్నారు. నాలుగు గంటల తర్వాత కూలీల గ్రూప్‌ ఫొటోను తీసి యాప్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో పనికి వచ్చిన వారంతా నాలుగు గంటలు నిరీక్షించాల్సి వ స్తోంది. పని అయిపోయినప్పటికీ రెండో ఫొటో కో సం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటున్నారు. కూలీలు ఉదయం 7లోపే పనికి రావాలని ఫీల్ట్‌ అసిస్టెంట్లు సూచిస్తున్నారు. యాప్‌లో తలెత్తుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని, ఫేస్‌ మ్యాచ్‌ కాని కూలీలకు కొత్త ఫొటోను అప్‌డేట్‌ చేయిస్తున్నామని డొంకేశ్వర్‌ మండల ఏపీవో శ్రీవాణి ‘సాక్షి’తో తెలిపారు.

గడ్డం పెరిగినా.. గుండు గీసినా

ఫేస్‌ క్యాప్చర్‌ చేయని మొబైల్‌ యాప్‌

హాజరు పడకుంటే ఆ రోజు పనికి దూరం

రెండుసార్లు ఫొటో విధానంతో

ఫీల్ట్‌ అసిస్టెంట్లకు తంటాలు

Advertisement
 
Advertisement
Advertisement