విద్యాశాఖను వదలని షాడో | - | Sakshi
Sakshi News home page

విద్యాశాఖను వదలని షాడో

Apr 17 2026 10:26 AM | Updated on Apr 17 2026 10:26 AM

పరోక్షంగా బెదిరింపులు కలెక్టర్‌ దృష్టిలో..

నలుగురు డీఈవోలు మారినా

తన సీటు వదలని అధికారిణి

తనకు నచ్చని ఉద్యోగులపై

బదిలీల అస్త్రం

ఖలీల్‌వాడి: ఓ విభాగానికి ఫుల్‌ అడిషనల్‌ చార్జి(ఎఫ్‌ఏసీ) హోదాలో పని చేస్తున్న అధికారిణి జిల్లా విద్యాశాఖ మొత్తాన్ని ఏలుతోందని ఆ శాఖ అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. నలుగురు డీఈవోలు మారినా సదరు అధికారిణి బదిలీ కాకపోవడం గమనార్హం. సదరు అధికారిణికి ఓ జిల్లాకు డీఈవోగా వెళ్లే అవకాశం వచ్చినా ఇక్కడే తిష్టవేసి ఆటాడుతోంది. శాఖలోని ఆయా సెక్షన్‌ల నుంచి వచ్చే ఫైల్స్‌ను తన వద్దే పెట్టుకొని చివరకు సంతకాలు లేకుండా జిల్లా అధికారి వద్దకు పంపించిన ఘటనలున్నాయని ఆ శాఖ సిబ్బంది అంటున్నారు.

బదిలీ కోసం ‘విల్లింగ్‌’ ఇచ్చే సదరు అధికారిణి అసలు సమయానికి తనకు బదిలీ కాకుండా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో ‘మేనేజ్‌’ చేసుకుంటోందనే ఆరోపణలున్నాయి. తన సీటును వదలని అధికారిణి నచ్చని ఉద్యోగులను విద్యాశాఖ కార్యాలయం నుంచి పాఠశాలలకు బదిలీ చేస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. డీఈవో కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తూ నిక్కచ్చిగా వ్యవహరించిన ఓ సీనియర్‌ ఉద్యోగిని నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని ఓ పాఠశాలకు జూనియర్‌ అసిస్టెంట్‌గా బదిలీ చేయడం గమనార్హం. దీంతో సదరు నాలుగు నెలలపాటు సెలవులో వెళ్లగా, ఆయన దరఖాస్తు సెక్షన్‌ నుంచి సదరు మహిళా ఆఫీసర్‌ వద్దకు చేరింది. సెలవుపై వెళ్లిన ఉద్యోగికి నాలుగు నెలల వేతనం మంజూరు కావడంతో తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ వేతనం మొత్తాన్ని చలాన్‌ రూపంలో వసూలు చేసిన అధికారిణి.. తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సెక్షన్‌లోని పలువురికి మెమోలు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ లేకుండా పాఠశాల విద్య డైరెక్టరేట్‌లో చక్రం తిప్పినట్లు సమాచారం. గతంలో సదరు అధికారిణికి ఇన్‌చార్జి డిప్యూటీ డీఈవోగా బాధ్యతలు దక్కగా.. కొన్నిరోజుల్లోనే తనకు అనుకూలంగా లేరనే ఉద్దేశంతో కొంత మందిని పాఠశాలలకు, మండలాలకు బదిలీ చేయడం అప్పట్లో చర్చకు దారి తీసింది.

విద్యాశాఖలో వివిధ పనుల కోసం ఆయా సెక్షన్‌ల కు వచ్చే వారిని అటకాయించే అధికారిణి.. సెక్షన్‌కు ఎందుకు వస్తారు వారిని ఏసీబీకి పట్టించడం, ఆర్టీ ఐ దరఖాస్తు పెట్టండి అంటూ రెచ్చగొడుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఆ అధికారిణి ఉన్నతస్థానంలో ఉండడంతో మిన్నకుండిపోతున్నారు.

ఫైనాన్స్‌ వింగ్‌కు ఎఫ్‌ఏసీగా పని చేస్తున్న అధికారిణి కి పనుల్లో నిర్లక్ష్యం కారణంగా షోకాజ్‌ నోటీసులు అందినట్లు తెలిసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లపై ఇటీవల కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షలు ఉండటంతో జిల్లా అధికారి అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్‌ సదరు మహిళా ఆఫీసర్‌ను పిలిపించి తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల వివరాలు చెప్పాలనగా.. తన వద్ద సమాచారం లేదని చెప్పడం గమనార్హం. సమాచారం లేనప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కలెక్టర్‌ ఆమైపె మండిపడినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement