● రైతులకు ఇబ్బందులు ● డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి
నిజామాబాద్ రూరల్: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కొనసాగిన సమయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని సమయస్ఫూర్తితో పరిష్కరించినట్లు గుర్తు చేశారు. దేశంలోనే 10 లక్షల క్వింటాళ్ల పసుపు వచ్చే నిజామాబాద్ మార్కెట్‌కు సాంగ్లీ, ఈ–రోడ్ మార్కెట్లతో పోటీ ఉంటుందని అన్నారు. 2016లో ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ పద్ధతిని ప్రారంభించామని, రెండు నెలల క్రితం వరకు అదే సాఫ్ట్‌వేర్ కొనసాగిందని, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 2.0 సాఫ్ట్‌వేర్‌లో నిజామాబాద్ మార్కెట్‌ను పొందుపర్చకపోవడంతో ఇబ్బందులు వచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలో పసుపు బోర్డు ఉన్నప్పటికీ ఎందుకు నమోదు చేయలేదని బీజేపీ నాయకులను నగేష్‌రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి మార్కెట్ కమిటీ చైర్మన్ సాంగ్లీ మార్కెట్‌లో ఉన్న ధరను ఇక్కడ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆందోళన చెందొద్దని తెలిపారు. ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నాడని, బోర్డు ద్వారా ప్రయోజనం ఉంటే రైతులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారో చెప్పాలన్నారు. సమావేశంలో డీసీసీ కోశాధికారి భక్తవత్సలం, డీసీసీ ఉపాధ్యక్షుడు కౌడపు శరత్ కుమార్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.


