నిందితుల కోసం గాలింపు చర్యలు
మోపాల్: మండలంలోని న్యాల్‌కల్ శివారులోగల ఫౌల్ట్రీ ఫామ్‌లో పూజిత (30) మంగళవారం అర్ధరాత్రి హత్యకు గురైంది. భర్త అర్జున్ రాథోడ్, ఆయన పెద్ద భార్య రాధ ఆమెను హత్య చేసి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీఐ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్‌కల్ శివారులోని కంటేగారి నవీన్‌రావుకు లక్ష్మీనర్సింహ ఫౌల్ట్రీ ఫామ్ ఉంది. ఆ ఫామ్‌లో పని చేయడానికి నెల రోజుల క్రితం మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన అర్జున్ రాథోడ్ తన ఇద్దరు భార్యలు రాధ, పూజితతో వచ్చాడు. పక్కనే ఉన్న రేకుల షెడ్డులో ఉంటూ పని చేస్తున్నారు. ఈ క్రమంలో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు యజమాని నవీన్‌రావు సముదాయించి సర్ధి చెప్పారు. తాజాగా మంగళవారం కూడా ముగ్గురి మధ్య గొడవ జరిగింది. అర్జున్ రాథోడ్ చిన్న భార్య పూజితను కర్రతో చితకబాది హత్య చేసి పెద్ద భార్య రాధతో కలిసి పరారయ్యాడు. రోజూవారీలాగే యజమాని నవీన్‌రావు పౌల్ట్రీ ఫామ్ వద్దకు వచ్చి చూడగా కోళ్లు అరుస్తున్నాయి. వెంటనే అర్జున్ రాథోడ్‌కు ఫోన్ చేయగా ఆయన భార్య రాధ ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చామని, అర్జున్ మెడికల్ షాప్‌కు వెళ్లాడని చెప్పింది. కోళ్లు అరుస్తున్నాయని, దాణా పెట్టలేదా అని అడగగా, పూజితకు పని చెప్పు అని ఫోన్ కట్ చేసింది. పూజితను లేపేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతిచెంది ఉంది. యజమాని నవీన్‌రావు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు.
ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీఐ..
మహిళ హత్యకు గురైన విషయం తెలుసుకున్న సీఐ సురేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూజిత మృతదేహాన్ని పరిశీలించగా ఒళ్లంతా గాయాలు కనిపించాయి.క్లూస్‌టీం, డ్వాగ్‌స్క్వాడ్‌ను పిలిపించారు. పక్కనే కర్రను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యజమాని నవీన్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా పూజితను అర్జున్ రాథోడ్, రాధ హత్య చేసి పరారయ్యారని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.


