పుస్తక పఠనం నిరంతరం కొనసాగాలి | - | Sakshi
Sakshi News home page

పుస్తక పఠనం నిరంతరం కొనసాగాలి

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

తెయూ వీసీ ప్రొఫెసర్‌ యాదగిరిరావు

లైబ్రరీ ఫెస్ట్‌లో ఉత్సాహంగా

పాల్గొన్న విద్యార్థులు

తెయూ(డిచ్‌పల్లి): పుస్తక పఠనం నిరంతరం కొనసాగాలని, విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకొని వాటి సాధనకు కృషి చేయాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ యాదగిరిరావు సూచించారు. తెయూ సెంట్రల్‌ లైబ్రరీలో బుధవారం నిర్వహించిన లైబ్రరీ ఫెస్ట్‌–2026 కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా హాజరైన ప్రసంగించారు. తరగతి గది బోధనతోపాటు లైబ్రరీలో నేర్చుకునే విద్యకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన, ఉపయోగకరమైన అన్నిరకాల పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు యూనివర్సిటీ కట్టుబడి ఉందని చెప్పారు. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ యాదగిరి మాట్లాడుతూ పుస్తక పఠనం విద్యార్థుల్లో లోతైన అవగాహనతోపాటు విశ్లేషణాత్మక దృష్టిని పెంపొందిస్తుందన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ ల్రైబరీలో పుస్తక పఠనం కోసం సమయం కేటాయించాలని సూచించారు. కీనోట్‌ స్పీకర్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ ఆంజనేయులు మాట్లాడుతూ.. పుస్తక పఠనం ద్వారా పద సంపద, వ్యాకరణం మెరుగుపడతాయని తెలిపారు. విద్యార్థులు ప్రముఖ, గొప్ప రచయితలు రాసిన ప్రేరణాత్మక పుస్తకాలను చదవాలని సూచించారు. లైబ్రరీ ఇన్‌చార్జీ, ప్రోగ్రాం కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కే.లావణ్య ‘పుస్తకం వనితా విత్తం’ అనే సంస్కృత నీతి శ్లోకాన్ని ఉదహరిస్తూ, పుస్తకం, సీ్త్ర, ధనం పరాయి చేతుల్లోకి వెళ్తే తిరిగిరావని, ఒకవేళ తిరిగి వచ్చినా తరుగుతాయని వివరించారు. కార్యక్రమంలో తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్‌ కనకయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ లక్ష్మణచక్రవర్తి, కోకన్వీనర్‌ డి.సత్యనారాయణ, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కన్వీనర్‌ ప్రొఫెసర్‌ లావణ్య వీసీ, రిజిస్ట్రార్‌తోపాటు వక్తలకు ప్రముఖ రచయిత అద్దంకి శ్రీధర్‌ బాబు రచించిన ‘సక్సెస్‌ సాధనకు 30 సూత్రాలు’ అనే పుస్తకాన్ని బహూకరించారు. అంతకుముందు లైబ్రరీ ఫెస్ట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను వీసీ, రిజిస్ట్రార్‌లు తిలకించి నిర్వాహకులను అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement