ఆలోచనల్లో అగ్రికల్చర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆలోచనల్లో అగ్రికల్చర్‌

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): నేటి కాలంలో చదువుకున్న యువత ఉద్యోగాల కోసం పోటీ పడుతుంటే.. జిల్లాకు చెందిన ఓ 25ఏళ్ల యువకుడు మాత్రం తన చదువును మట్టిలో బంగారం పండించడానికి ఉపయోగిస్తున్నాడు. తాను చదివిన బీఎస్సీ అగ్రికల్చర్‌ విద్యను స్వగ్రామంలోనే అమలు చేస్తూ ప్రకృతి వ్యవసాయంలో అద్బుతాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు డొంకేశ్వర్‌ మండలం నికాల్‌పూర్‌ గ్రామానికి చెందిన జైడి గౌతమ్‌రెడ్డి. పైగా ఒకే భూమిలో పది రకాల పంటలు పండిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ఈ యువరైతు సాగులో చూపిస్తున్న ఉత్సాహాన్ని, తెలివితేటలను చూసి తోటి రైతులు శభాష్‌ గౌతమ్‌ అని ప్రశంసిస్తున్నారు. గౌతమ్‌రెడ్డిది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయం అంటే తనకు చిన్నప్పటి నుంచి ఇష్టం. తండ్రి జైడి తిరుపతిరెడ్డితో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లేవాడు. పదో తరగతి పూర్తి కాగానే సాగు చేయాలనే తపన మరింత పెరిగింది. అందుకు తగ్గట్లుగా ఏదైనా చదువు చదువాలని నిర్ణయించుకుని హైదరాబాద్‌లో బీఎస్సీ అగ్రికల్చర్‌ను మూడేళ్ల క్రితం పూర్తి చేశాడు. తాను చదివిన చదువుకు కార్పొరేట్‌ కంపెనీల్లో లేదా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే అవకాశం ఉన్నా వ్యవసాయం చేయాలన్న ఆకాంక్ష ఉండి.. అన్నదాతల కష్టాలు తెలిసిన వాడు కావడంతో తన చదువును, విజ్ఞాన్ని ఉపయోగించి ప్రకృతి వ్యవసాయాన్ని మొదలు పెట్టాడు.

గౌతమ్‌రెడ్డి ఐడియాతో ఆయిల్‌పాం తోటలో

అంతర పంటగా సాగవుతున్న అరటి తోట

జీవామృతం ఎరువును తయారు చేస్తున్న గౌతమ్‌రెడ్డి

అంతటా బిందు సేద్యం

ప్రస్తుతం గౌతమ్‌రెడ్డి తన పొలలంలో ఎటువంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా పూర్తి ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో సాగు చేస్తున్నాడు. బెల్లం, పిండి, ఆవుపేడ, ఆవు మూత్రం, నీళ్లు తగు మోతాదులో కలిపి జీవామృతాన్ని తయారు చేసి పంటలకు అందిస్తున్నాడు. విశేషం ఏమిటంటే.. ఒకే క్షేత్రంలో జామ, ఆయిల్‌పామ్‌, అరటి, బొప్పాయి, మునగ, గోధుమ, వరి, పప్పుదినుసులు, కూరగాయలు, పసుపు పంటలు పండిస్తున్నా డు. అంతర పంటల పద్ధతిని పాటిస్తూ తక్కు వ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నాడు. కాగా, వరిలో దేశీ రకాలను మాత్రమే సాగు చేస్తున్నాడు. అలాగే నీటిని పొదుపు పా టించడానికి వంద శాతం డ్రిప్‌ సిస్టమ్‌ను విని యోగిస్తున్నాడు. కూలీల అవసరం లేకుండా యాంత్రీకరణను కూడా సద్వినియోగం చేసుకుంటున్నాడు. అయితే, తన కొడుకు చేస్తున్న ప్రయోగాలు, వాటి ఫలితాలను చూసి తండ్రి తిరుపతిరెడ్డి మురిసిపోతున్నాడు.

రైతు కొడుకు రైతుగా రాణిస్తున్నాడు. తమ కుటుంబానికి అన్నం పెట్టిన వ్యవసాయరంగంలోనే ఉన్నతవిద్యాభ్యాసం పూర్తి చేసి తాను పుట్టిపెరిగిన ఊరిలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. చిన్ననాటి నుంచి తండ్రి అడుగుల్లో అడుగులు వేస్తూ వ్యవసాయాన్ని దగ్గరుండి గమనించిన ఆ యువకుడు.. తన ఆలోచనల్లోనే అగ్రి‘కల్చర్‌’ ఉందని నిరూపిస్తున్నాడు.

సాగులోనే సంతృప్తి ఉంది

ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా అటు భూసారం దెబ్బతినదు, ఇటు ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుతుంది. చదువుకున్న వారు వ్యవసాయంలోకి వస్తే వినూ త్న మార్పులు తీసుకురావొచ్చు. సంపాదనకు ఉద్యోగాలు మాత్రమే మార్గం కాదు. తలుచుకుంటే వ్యవసాయం కూడా లాభదాయకమే. నేను అదే దారిలో వెళ్లడం వలన తద్వారా సాగులో అసలైన సంతృప్తి లభిస్తోంది. – జైడి గౌతమ్‌ రెడ్డి, యువరైతు

బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివి

ప్రకృతి సేద్యం

ఆరు ఎకరాల్లో పది రకాల పంటలు

ఉద్యోగాలను కాదనుకొని

ఊరిలో అద్భుతాలు

ప్రశంసలు పొందుతున్న

యువ రైతు గౌతమ్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement