నిజామాబాద్‌అర్బన్: ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 124 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌తోపాటు సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్నకు విన్నవిస్తూ అర్జీలు అందజేశారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆస్తి లాక్కుని పట్టించుకోవడం లేదు
తన ఆస్తి లాక్కున్న పెద్ద కుమారుడు తనను పట్టించుకోవడం లేదని ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన జోరిగె రాజుబాయి సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఇద్దరు కుమారులు గంగామోహన్, నవీన్ ఉన్నారని, భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడన్న వృద్ధురాలు.. తమకున్న 8 ఎకరాల భూమిని పెద్ద కుమారుడు అక్రమంగా పట్టా చేయించుకున్నాడని, తన ఆభరణాలతోపాటు విలువైన డాక్యుమెంట్లు తీసుకున్నాడని తెలిపింది. మూడు నెలలపాటు హైదరాబాద్‌లో తన వద్ద ఉంచుకొని తీవ్రంగా హింసించి తనకున్న అర ఎకరం పొలాన్ని సైతం తన పేరు మీద పట్టా చేసుకున్నాడని భోరుమన్నది. కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న తనను పెద్దకుమారుడు పట్టించుకోవడం లేదని, అతడిపై చర్యలు తీసుకుని తన ఆస్తిని తనకు ఇప్పించాలని విన్నవించింది.


