● తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థ
చైర్మన్ అన్వేష్ రెడ్డి
● నాగిరెడ్డిపేట, లింగంపేటలో
రైతులతో సమావేశం
నాగిరెడ్డిపేట/లింగంపేట : వచ్చే వానాకాలంలో తెలంగాణ రాష్ట్ర విత్తనసంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాలకు నాణ్యమైన విత్తనాలు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి, లింగంపేట మండలం శెట్పల్లి గ్రామాల్లో ఆయన రైతులతో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజన్‌కు అవసరమైన వరి విత్తనాలు సన్నరకాలైన బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, కేఎన్‌ఎం 1638, దొడ్డు రకాలు కేఎన్‌ఎం 118, ఎంటీయూ 1010 సమృద్ధిగా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. జీలుగ, జనుము విత్తనాలను సకాలంలో అందజేస్తామన్నారు. రైతులు నిరంతరం వరి మాత్రమే సాగు చేయకుండా పంట మార్పిడి చేయాలని సూచించారు. రసాయన మందులను వినియోగించి వ్యవసాయం చేస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు తక్కువ ధరకు నాణ్యమైన విత్తనాలను అందిస్తోందని, కానీ రైతులు మాత్రం మార్కెట్‌లో ఎక్కువ ధరకు లభించే ప్రయివేట్ కంపెనీల విత్తనాలే నాణ్యమైనవిగా భావించి కొనుగోలు చేస్తున్నారన్నారు. కాగా, మార్కెట్‌లో కొనుగోలు చేసిన విత్తనాలతో నష్టపోయే రైతులకు తగిన పరిహారం అందించేలా ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. సమావేశంలో ఆత్మ కమిటీ చైర్మన్ దశరథ్ నాయక్, సర్పంచులు జ్యోతిరెడ్డి, అట్టెం శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సకృనాయక్, ఆత్మకమిటీ డైరెక్టర్ కిష్టయ్య, నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎస్సై భార్గవ్‌గౌడ్, ఏవో సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.


