● వీసీలో జనగణన రాష్ట్ర
సంచాలకురాలు భారతి హోళీకేరి
నిజామాబాద్ అర్బన్: జనగణనలో భాగంగా చేపట్టనున్న హౌస్ లిస్టింగ్ (ఇళ్ల గణన) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జనగణన రాష్ట్ర సంచాలకురాలు భారతి హోళీకేరి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఇళ్ల గణన కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనగణనలో భాగంగా మే 11 నుంచి నిర్వహించే ఇళ్ల గణన ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఇళ్ల జాబితా బ్లాక్‌లను రూపొందించాలని, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల నియామకం, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని అన్నారు. ఇళ్ల గణన, జనగణన జాబితా ప్రకారం అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో దోహదపడతాయని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ హౌస్ లిస్టింగ్ ప్రక్రియను చేపట్టేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇళ్ల గణన కోసం ఆరు మండలాలు మినహా జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్ల సరిహద్దుల నిర్ధారణ పూర్తయ్యిందని, మిగిలిన మండలాల్లోనూ 15వ తేదీ నాటికి పూర్తి చేస్తామని అన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.


