పల్లెల్లో
● క్షేత్ర స్థాయిలో నివారణకు చర్యలు
● దశల వారీగా నిషేధం అమలు చేసే యోచన
ప్లాస్టిక్ కవర్లు వినియోగించవద్దని వ్యాపారులకు సూచిస్తున్న కమ్మర్‌పల్లి ఉప సర్పంచ్ అశోక్
మోర్తాడ్(బాల్కొండ): ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలపై క్షేత్రస్థాయిలో వ్యాపారులకు, ప్రజలకు పలు గ్రామ పంచాయతీలు అవగాహన కల్పిస్తున్నాయి. దశల వారీగా పాలిథిన్ నిషేధం వైపు అడుగులు వేస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్ల నిషేధం అమలుకు శ్రీకారం చుడుతున్నాయి. ఇప్పటి వరకు గంజాయి, సిగరెట్లు, గుట్కావంటి మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన నిబంధనలను విధించి అమలు చేస్తూ అనేక పంచాయితీలు ఆదర్శవంతంగా నిలిచాయి. తాజాగా మోర్తాడ్, తిమ్మాపూర్, కమ్మర్‌పల్లి గ్రామ పంచాయతీల్లో ప్లాస్టిక్ కవర్ల నిషేధం అమలుపై పాలకవర్గాలు ఒక అడుగు ముందుకు వేశాయి. మొదట వ్యాపారులకు అవగాహన కల్పించి తరువాత ప్రజలలో చైతన్యం తీసుకరావాలని నిర్ణయించాయి. కమ్మర్‌పల్లిలో శనివారం అంగడి సాగగా అక్కడ ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, వార్డు సభ్యులు, కార్యదర్శితో కలిసి వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లలో సరుకులు పెట్టి ఇవ్వకూడదని సూచించారు. 15 రోజుల తరువాత ప్లాస్టిక్ కవర్లు వ్యాపారుల వద్ద కనిపిస్తే రూ.500ల నుంచి రూ.వెయ్యి వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అంగడికి వచ్చే వినియోగదారులు కూడా బట్ట సంచులు తీసుకుని రావాలని ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు. తిమ్మాపూర్‌లో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణకు ప్రతి వీధిలో ఒక డబ్బాను ఏర్పాటు చేసి అందులో ప్రజలు ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువులు అందులో వేసేలా అవగాహన కల్పించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వ్యాపారులతో సమావేశాలను నిర్వహించి ప్లాస్టిక్ కవర్లు కొనుగోలు చేయకుండా ఉండేలా చొరవ తీసుకుంటున్నారు. బట్ట సంచులు, కాగితపు కవర్లు తయారు చేసే యంత్రాలను కొనుగోలు చేసేవారికి సబ్సిడి రుణాలు ఇప్పించాలని పాలకవర్గం నిర్ణయించడం విశేషం. మోర్తాడ్‌లో వ్యాపారులతో సమావేశంను నిర్వహించి మహిళా సంఘాలు, కుల సంఘాల సహారంతో ప్లాస్టిక్ కవర్ల నిషేధంను అమలు చేయాలని నిర్ణయించారు. ఇలా ప్లాస్టిక్‌పై మూడు గ్రామ పంచాయితీలు చేపట్టిన సమరం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచి అంతటా ప్లాస్టిక్ కవర్లపై నిషేధం అమలు చేయాలని పలువురు కోరుతున్నారు.
ప్లాస్టిక్ రహిత గ్రామంగా తిమ్మాపూర్
ప్లాస్టిక్ రహిత గ్రామంగా తిమ్మాపూర్‌ను అగ్రభాగాన ఉంచుతాం. వ్యాపారులు, ప్రజలకు ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగే నష్టంపై అవగాహన కల్పించి దశల వారీగా కవర్ల నిషేధం అమలు చేస్తాం. రీసైక్లింగ్ చేయడానికి వీలు ఉండే ప్లాస్టిక్ సామగ్రి సేకరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
– పుప్పాల నరేశ్, సర్పంచ్, తిమ్మాపూర్
అందరి సహకారంతో..
గ్రామ ప్రజలు, అధికారుల సహకారంతో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై నిషేధం అమలు చేస్తాం. ప్రజలు సరుకులు కొనుగోలు చేయడానికి వెళ్లే సమయంలో బట్ట సంచులు తీసుకవెళ్లాలి. వ్యాపారులు కవర్లలో సరుకులు ఇవ్వొద్దు. అవసరమైతే బట్ట సంచులు విక్రయించాలి.
– భోగ ఆనంద్, సర్పంచ్, మోర్తాడ్
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని..
ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యంపై పరోక్షంగా దెబ్బ పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యం కాపాడటానికి ప్లాస్టిక్ కవర్ల నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించాం. ప్రజల సహకారంతో కమ్మర్‌పల్లిని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుతాం.
– కొత్తపల్లి హారిక, సర్పంచ్, కమ్మర్‌పల్లి
పాలిథిన్ ముప్పుపై గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో అవగాహన


