కందకుర్తికి ముగ్గురు సర్‌ సంఘ్‌చాలక్‌లు | - | Sakshi
Sakshi News home page

కందకుర్తికి ముగ్గురు సర్‌ సంఘ్‌చాలక్‌లు

Apr 12 2026 2:24 AM | Updated on Apr 12 2026 2:24 AM

1993లో బాలాసాహెబ్‌ దేవరాజ్‌

1994లో రాజేంద్రసింహ్‌

తాజాగా మోహన్‌ భగవత్‌

కందకుర్తిలోని కేశవ స్ఫూర్తి మందిరంలో బుక్‌లో రాసి సంతకం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌ సంచాలక్‌ మోహన్‌రావ్‌ భగవత్‌.. సభలో ప్రార్థన చేస్తూ..

రెంజల్‌(బోధన్‌): శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా వందేళ్లు పూర్తి చేసుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌కు ఇప్పటి వరకు ఆరుగురు సర్‌ సంఘ్‌చాలక్‌లు పనిచేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వందేళ్ల ప్రస్థానంలో ఇప్ప టి వరకు ముగ్గురు సర్‌ సంఘ్‌చాలక్‌లు మండలంలోని కందకుర్తిని సందర్శించారు. వారిలో 1993లో 3వ సర్‌ సంఘ్‌చాలక్‌ బాలాసాహెబ్‌ దేవరాజ్‌జీ, 94లో 4వ సర్‌ సంఘ్‌చాలక్‌ రాజేంద్రసింహ్‌ రజ్జుభయ్యా సందర్శించారు. శనివారం 6వ సర్‌ సంఘ్‌ చాలక్‌ మోహన్‌రావ్‌ భగవత్‌జీ సందర్శించారు.

భగవత్‌జీ పర్యటన చారిత్రాత్మకం:

మోహన్‌ భగవత్‌జీ పర్యటన చారిత్రాత్మకంగా మారింది. కందకుర్తి చరిత్రను భావితరాలకు అందిచాలనే సంకల్పంతో నిర్మించిన స్ఫూర్తి మందిరాన్ని ఆయన ప్రారంభించారు. స్ఫూర్తి మందిరంలో ఏ ర్పాటు చేసిన ఫోటో, ఆర్ట్‌ గ్యాలరీని ఆయన పరిశీలించారు. అయోధ్యలోని బాలరాముని విగ్రహా న్ని తయరు చేసిన అరుణ్‌ యోగిరాజ్‌తో భరత మాత, డాక్టర్‌జీ విగ్రహాలను తయారు చేయించా రు. కింది అంతస్తులో డాక్టర్‌జీ విగ్రహం, పైఅంతస్తులో భరతమాత విగ్రహాలను ఏర్పాటు చేశారు. డాక్టర్‌జీ జీవిత చరిత్రను తెలుసుకునేలా మినీ థియేటర్‌ను సందర్శించారు. సందర్శకుల రిజిస్టర్‌లో స్ఫూర్తి కేంద్రం రాబోయో తరాలకు స్ఫూర్తి కలిగించాలని ఆయన సంతకం చేశారు.

భారీ బందోబస్తు:

భగవత్‌జీ పర్యటన సందర్భంగా కందకుర్తిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. బాంబ్‌స్క్వాడ్‌ పోలీసులు సభా వేదికతో పాటు స్ఫూర్తి మందిరాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సభలో నేరుగా భగవత్‌జీతోనే మాట్లాడించారు. 22 నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల స్వయం సేవకులు, బీ జేపీ నాయకులు సుమారు 5వేల మంది తరలివచ్చారు. వేదికపైన మోహన్‌ భగవత్‌జీతో పాటు తెలంగాణప్రాంత మాననీయ సంఘ చాలకులు సుందర్‌రెడ్డి, దక్షిణ మధ్య క్షేత్ర మాననీయ సహ సంఘ చాలకులు దూసి రామకృష్ణ, మోహన్‌రెడ్డి, తెలంగాణ ప్రాంత సేవాభారతి అధ్యక్షులు దుందురపు దుర్గారెడ్డి, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త సీబీఆర్‌ ప్రసాద్‌, ఏవీఎన్‌ రాజు, కేశవ స్ఫూర్తి మందిరం అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement