భారమైన కువైట్‌ ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

భారమైన కువైట్‌ ప్రయాణం

Apr 12 2026 2:24 AM | Updated on Apr 12 2026 2:24 AM

సామాన్యులకు భారమే...

మోర్తాడ్‌(బాల్కొండ): ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య యుద్ధ విరామం ఏర్పడినా గల్ఫ్‌ దేశమైన కువైట్‌కు వెళ్లి రావాలంటే ప్రయాణం భారంగా మారింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల సమయంలో ఇరాన్‌ బాంబుల దాడులతో కువైట్‌ ఎయిర్‌పోర్టు పూర్తిగా దెబ్బతిన్నది. మరమ్మతులు పూర్తి చేయడానికి ఇంకా సమయం ఉండటంతో కువైట్‌కు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. కువైట్‌లో ఉపాధి కోసం వీసాలు జారీ అవుతున్నా అక్కడికి వెళ్లాలంటే సామాన్య వలస కార్మికులపై భారీగా ఆర్థిక భారం ఏర్పడుతోంది. కువైట్‌ నుంచి ఇంటికి రావాలన్నా అదే పరిస్థితి నెలకొనడంతో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కువైట్‌కు నేరుగా విమానాలు లేక పోవడంతో సౌది అరేబియా మీదుగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. కువైట్‌ నుంచి ఇంటికి రావాలన్నా ఇక్కడి నుంచి అక్కడకు వెళ్లాలన్నా సౌది అరేబియాకు సంబంధించిన విజిట్‌ వీసాను కొనుగోలు చేయాల్సి వస్తోంది. సౌది విజిట్‌ వీసాకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఖర్చు అవుతోంది. గతంలో కువైట్‌కు వెళ్లాలంటే విమాన చార్జీలు రూ.10 వేల నుంచి రూ.15 వేలు అయ్యేవి. రంజాన్‌ సమయంలో మాత్రమే రూ.30 వేల చార్జీలు ఉండేవి. ప్రస్తుత పరిస్థితుల్లో సౌది మీదుగా ప్రయాణం చేయాల్సి రాగా, మరోవైపు విమాన చార్జీలను ఆయా ఏవియేషన్‌ సంస్థలు భారీగా వసూలు చేస్తున్నాయి. ఒక్కో విమాన టిక్కెట్‌ ధర రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పెరిగింది. విజిట్‌ వీసా, విమాన చార్జీలు అధికం కావడంతో వలస కార్మికులపై తీవ్ర ఆర్థిక భారం ఏర్పడుతోంది. సకాలంలో కువైట్‌కు చేరుకోకపోతే వీసా గడువు ముగిసిపోతుందనే ఆందోళనతో ఆర్థి భారమైనా వలస కార్మికులు ప్రయాణం సాగిస్తున్నారు. మన విదేశాంగ శాఖ చొరవ తీసుకుని కువైట్‌కు వలస వెళ్లే కార్మికులపై ఏర్పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని పలువురు కోరుతున్నారు.

ఇరాన్‌ దాడుల్లో దెబ్బతిన్న

కువైట్‌ విమానాశ్రయం

నిలిచిపోయిన విమాన సర్వీసులు

సౌదీ నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో అదనంగా విజిట్‌ వీసాకు చార్జీలు

వలస కార్మికులకు ఆర్థిక ఇబ్బందులు

కువైట్‌లో ఉపాధి పొందాలనుకునే వలస కార్మికులకు సౌది మీదుగా ప్రయాణం చేయడం భారంగా మారింది. విదేశాంగ శాఖ చొరవ తీసుకుని విమాన చార్జీల విషయంలోను, సౌది విజిట్‌ వీసా అంశంపై అక్కడి విదేశాంగ శాఖతో చర్చలను నిర్వహించాలి. వలస కార్మికులపై ఆర్థిక భారం తగ్గించేలా చూడాలి.

– గుల్లె రాజేశ్వర్‌, కువైట్‌లో వ్యాపారి (ఏర్గట్ల)

Advertisement
 
Advertisement
Advertisement