పంచాయతీల్లో కార్మికుల కొరత
● తీవ్రమవుతున్న పారిశుద్ధ్య
నిర్వహణ సమస్య
● రోజువారీ కూలీలతో
పనులు చేయిస్తున్న సర్పంచ్‌లు
మోర్తాడ్(బాల్కొండ): గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ సమస్య తీవ్రమైంది. జనాభా పెరుగుతున్నా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెరగకపోవడంతో గ్రామాల్లో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. పంచాయతీల్లో నిధుల కొరత ఉ న్నా రోజువారీ కూలీలను రప్పించి పారిశుద్ధ్య పను లు చేపట్టేందుకు సర్పంచ్‌లు నడుం బిగించారు. జిల్లాలో 545 గ్రామ పంచాయతీల్లో 3054 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో కారోబార్లు, బిల్‌కలెక్టర్లను మినహాయించగా 2,300ల మంది వరకు కా ర్మికులు ఉన్నారు. జనాభా ఎక్కువగా ఉండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారితే ఆ సమస్యను పరిష్కరించడానికి ఉన్న సిబ్బంది సరిపోవడం లేదు. మేజర్ పంచాయతీలలో కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్, ఇదే మండలంలోని చేపూర్‌ల నుంచి అద్దె కూలీలను రప్పిస్తున్నారు. ఒక్కోక్కరికి రోజుకు రూ.500 కూలి చెల్లించి రవాణా చార్జీలను పంచాయతీలే భరిస్తున్నాయి. సమస్య తీవ్రతను బట్టి ఒక్కో రోజు 10 మంది నుంచి 20 మంది కూలీలను రప్పిస్తున్నారు. రోజుకు రూ.6వేల నుంచి రూ.12 వేల వరకూ ఖర్చు చేస్తూ అద్దె కూలీలతో పరిసరాలను పరిశుభ్రంగా మారుస్తున్నారు. కొత్తగా ఎంపికైన సర్పంచ్‌లకు పారిశుద్ధ్య సమస్యనే ప్రధానం కావడంతో ఖర్చుకు వెనుకాడకుండా రోజువారీ కూలీలతో పనులు కానిస్తున్నారు. నిధులు లేకపోవడంతో సొంతంగా డబ్బులు చెల్లించి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో ఎంబీలను రికార్డు చేయించి ఉంచుతున్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వగానే పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కోసం తాము చేసిన ఖర్చులకు బిల్లులు పొందాలని సర్పంచ్‌లు భావిస్తున్నారు.
ప్రజారోగ్యం కోసం ఖర్చు చేస్తున్నాం
ప్రజారోగ్యం ముఖ్యం కావడంతో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించడం కోసం ఖర్చు చేయక తప్పడం లేదు. పరిసరాలు బాగుంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. రోజువారీ కూలీలతో మురికి కాలువలను శుభ్రం చేయించడానికి బాగానే ఖర్చు అవుతుంది.
– కొలిప్యాక ఉపేంద్ర, సర్పంచ్, ఏర్గట్ల
పంచాయతీల్లో కార్మికుల కొరత


