బ్యాలెట్‌తోనే మున్సిపోల్స్
● పరోక్ష పద్ధతిలో చైర్‌పర్సన్ ఎన్నిక
● పార్టీ గుర్తులతో నిర్వహణకు ఎన్నికల కమిషన్ నిర్ణయం
ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్, పార్టీ గుర్తులతోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహించిన ఎన్నికల కమిషన్.. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కార్పొరేషన్లతోపాటు 117 మున్సిపాలిటీల్లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. కౌన్సిలర్‌ను ఎన్నుకొనేందుకు వినియోగించే బ్యాలెట్ పత్రాలు తెలుపు రంగులో, అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తులతో ఉంటాయి. ఓటరు తాను ఓటు వేయాలనుకున్న అభ్యర్థి పార్టీ గుర్తుపై స్టాంప్ వేయాల్సి ఉంటుంది. పోలింగ్ అనంతరం ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఒక్కో బ్యాలెట్ పేపర్‌ను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఈ విధానంలో వార్డు కౌన్సిలర్ల ఎంపికకు మాత్రమే ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు రావడంతో చైర్‌పర్సన్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రచారానికి నేతలు రెడీ..
ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ ల్లో ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులకు ప్రత్యేకంగా గుర్తులను కేటాయించారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం లాంటి ప్రధాన పార్టీల నాయకులు పంచాయతీ ఎన్నికల్లో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించారు. గెలిచిన అభ్యర్థిని తమ పార్టీలో చేర్చుకోవచ్చనే నమ్మకంతో నేరుగా ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపించలేదు. అయితే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు ఆ ర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో నిర్వహించే ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థులు సమర్పించే బీ ఫాం ఆధారంగా రాజకీయ పార్టీల గుర్తులను కే టాయించనున్నారు. దీంతో నియోజకవర్గాల పరిధిలో పార్టీలకు నాయకత్వం వహిస్తున్న నేతలు అ భ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. మున్సిపాలిటీల్లో తమ పార్టీ జెండాను ఎగురవేస్తే భవిష్యత్‌లో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలిసి వచ్చే అంశంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు ధన్‌పాల్, పైడి రాకేశ్ రెడ్డి, బోధన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, బా ల్కొండ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తమ పరిధిలోని మున్సిపాలిటీలపై ఆధిపత్యం కో సం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.


