ఎన్‌ఎంసీలో పోలింగ్ కేంద్రాల పెంపు
● మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్
● రాజకీయ పార్టీల ప్రతినిధులతో
సమావేశం
సుభాష్‌నగర్: నిజామాబాద్ మున్సిపల్ కా ర్పొరేషన్‌లో పెరిగిన ఓటర్ల సంఖ్యకు అను గుణంగా పోలింగ్ కేంద్రాలను పెంచుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ తెలిపారు. శనివారం కా ర్పొరేషన్ కార్యాలయంలోని తన చాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో గతంలో 2.92 లక్షల మంది ఓటర్లు ఉండేవారని, ప్రస్తుతం 3.47 లక్షలకు పెరిగారని పేర్కొన్నారు. 413 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటి సంఖ్య 434కు పెరిగిందన్నారు. పెరిగిన పోలింగ్ కేంద్రాలకు భవనం, వసతులపై అభిప్రాయాలను సేకరించామని తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాలను మారుస్తున్నాని, వాటి స్థానంలో కొత్త కేంద్రాలను ఎంపిక చేశామన్నారు. ఈ నెల 13న ముసాయిదా పోలింగ్ కేంద్రాలను ప్రదర్శిస్తామని, 16న తుది పోలింగ్ కేంద్రాల జాబితాతోపాటు పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటో ఓటరు తుది జాబితాను ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో తప్పిదాలపై కమిషనర్, ఆర్డీవో, తహసీల్దార్లు, బీఎల్‌వోలతో వివరాలు సేకరించి సరి చేస్తున్నామని, ఏ డివిజన్‌లోని ఓటరు అదే డివిజన్‌లో ఓటు వేసేలా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని కమిషనర్ పేర్కొన్నారు. అదనపు కమిషనర్ రవీందర్ సాగర్, ఏసీపీ శ్రీనివాస్, ఆయా పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


