నగరాభివృద్ధే లక్ష్యం
● అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ
● పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్
అధికారులతో సమీక్ష
సుభాష్‌నగర్ : ఇందూరు నగర అభివృద్ధే లక్ష్యంగా, ప్రజా సంక్షేమమే ఆశయంగా ముందుకు సాగుతున్నామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయంలో పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో ఆయన శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో చేపడుతున్న పలు కీలక అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించి, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అనంతరం ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ అమృత్–2 పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ, మ్యాన్‌హోల్స్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన అన్ని నిర్మాణాలను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రతి డివిజన్‌కు టీయూఎఫ్‌ఐడీసీ ఫండ్ నుంచి విడుదలైన రూ.కోటితో చేపట్టే అభివృద్ధి, మరమ్మతు పనుల కోసం టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. రామర్తి చెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేసి, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, మున్సిపల్ ఇన్‌చార్జి ఈఈ నాగేశ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఏఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


