కామారెడ్డిలో దొంగల బీభత్సం
● ఐదు దుకాణాలు, రెండిళ్లలో చోరీకి పాల్పడిన షట్టర్ లిఫ్టింగ్ ముఠా
● భారీగా నగదు, విలువైన
వస్తువుల అపహరణ
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలో శుక్రవారం వేకువజామున షట్టర్ లిఫ్టింగ్ ముఠా దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు బైక్‌ల మీద వచ్చిన నలుగురు దుండగులు పలు కాలనీల్లో దుకాణాలు, తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి అందినకాడికి దోచుకెళ్లారు. మరిన్ని దుకాణాలు, ఇళ్ల చోరీకి య త్నించారు. వివరాలు ఇలా.. ఉదయం 4 గంటల ప్రాంతంలో శ్రీరాంనగర్ కాలనీ బసేరా లాడ్జి గల్లీలో ఉన్న రెండు సెల్‌ఫోన్ షాపుల షట్టర్‌లను గడ్డపారలతో దుండగులు లిఫ్ట్ చేశారు. శ్రీలక్ష్మీ మొబైల్స్‌లోకి ప్రవేశించి రూ.25 వేలు నగదు, 5 సెల్‌ఫోన్‌లు, లక్ష్మీ నరసింహా మొబైల్స్ లోనుంచి సెల్‌ఫోన్‌లు, ఇతర వస్తువులు చోరీ చేశారు. అక్కడనుంచి భగత్‌సింగ్ నగర్ లయన్స్ క్లబ్ సమీపంలోని మరో మూడు దుకాణాల షట్టర్‌లను గడ్డపారలతో పైకెత్తి చోరీలు చేశారు. లక్ష్మీ గిఫ్ట్‌స్ అండ్ నావెల్టీస్ దుకాణంలోకి చొరబడి రూ.లక్ష నగదు, ఇతర విలువైన వస్తువులు, ఏఆర్ ఆన్‌లైన్ సెంటర్‌తోపాటు మరో ఇంటర్‌నెట్ సెంటర్‌లోకి చొరబడి రూ.10వేల వరకు దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. తాళం వేసి ఉన్న శ్రీరాంనగర్ కాలనీకి చెందిన జమీరుద్దీన్, అశోక్‌నగర్ కాలనీకి చెందిన మహ్మద్ సిరాజ్‌ల ఇళ్లను టార్గెట్ చేశారు. తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డారు. వారిళ్లలో విలువైన వస్తువులు, నగదు లేకపోవడంతో నష్టం జరుగలేదు. అంతేకాకుండా శ్రీరాంనగర్ కాలనీలోని వెంకటేష్ అనే వ్యక్తి బైక్ చోరీకి గురైనట్లు తెలిసింది. ముందుగా ఆ బైక్‌ను చోరీ చేసి దానిపైనే తిరుగుతూ ఇతర చోరీలకు పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఆయా దుకాణాల్లో చోరీకి గురైన నగదు, వస్తువుల విలువ మొత్తం రూ.5 లక్షల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు ఆయా దుకాణాలు, ఇళ్లకు చేరుకుని విచారణ జరిపారు. క్లూస్‌టీం బృందాలు ఆధారాలు సేకరించాయి. సీసీ కెమెరాలను పరిశీలించగా నలుగురు దుండగులు చోరీలకు పాల్పడినట్లు తెలుస్తుంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


