ఒక్కో వీడీసీది ఒక్కో లెక్క
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో సమాంతర వ్యవస్థలు నడుపుతున్న గ్రామాభివృద్ధి కమిటీలు(వీడీసీ) ఒక్కో గ్రామంలో ఒక్కోవిధంగా తమ హవా కొనసాగిస్తున్నాయి. గ్రామా ల్లో ప్రతి విషయంలో తాము చెప్పినట్లే నడవాలనే ఉద్దేశంతో వీడీసీ సభ్యులు, ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం, ఎన్నికల నియమావళితో నిమిత్తం లేకుండా పలు గ్రామాల్లో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్ పదవులను వేలం వేశారు.
కొన్ని గ్రామాల్లోనైతే ఏకంగా ఇసుక, మొరం మాఫియాతో చేతులు కలిపి డమ్మీ అభ్యర్థులను బరిలో నిలిపి, తమ చెప్పుచేతల్లో ఉండే వాళ్లు స ర్పంచ్‌లుగా ఎన్నికయ్యేలా చేశారు. గెలిచిన సర్పంచ్‌లు, పాలకవర్గ సభ్యులు స్వేచ్ఛగా, సొతంత్రంగా పనిచేసే వాతావరణం లేకుండా చేశారు. వీడీసీలు, ఇసుక, మొరం మాఫియా ఏది చెబితే అదే చేయాలనేవిధంగా హుకుం జారీ చేస్తున్నారు. వీడీసీల కథలు ఒక్కో గ్రామంలో ఒక్కోలాగా ఉన్నాయి. వీడీసీలను అడ్డం పెట్టుకుని అధికార పార్టీకి చెందిన కొందరు నియోజకవర్గ నాయకులు సొంత దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది.
● వెల్మల్‌లో వీడీసీ వ్యవహారం ఇంతటితో ఆగలేదు. గత నెల 28న గ్రామంలో బెల్టు దుకాణం కోసం వేలం వేయగా రూ.2.65 లక్షలు పలికింది. చికెన్ దుకాణం రూ.3.25 లక్షలు పలికింది. దీనిపై రాములు నిజామాబాద్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. ఇంకా కేసు నమోదు కాలేదు.
● మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామంలోనూ పంచాయతీ ఎన్నికల సమయంలో వీడీసీ అరాచకంపై పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. గ్రామంలో సర్పంచ్ పదవిని రూ.32.80 లక్షలకు, ఉప సర్పంచ్ పదవిని రూ.7 లక్షలకు వేలం వేసినట్లు ఫి ర్యాదులో పేర్కొన్నారు. తమను నామినేషన్లు వేయ నీయకుండా, ఓటు హక్కు వినియోగించుకోనీయ కుండా చేస్తున్నారని పలువురు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు వెల్లడించారు. వీడీసీని కాదని నామినేషన్లు వేస్తే ప్రతీకారంతో ప్రాణహాని చేసేందుకు ప్రయత్నాలు చేసే అవకాశముందని, తమకు రక్షణ కల్పిస్తే నామినేషన్లు వేస్తామని వివరించారు. అతి కష్టం మీద కొందరు నామినేషన్లు వేసినప్పటికీ చివరకు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
● వేల్పూర్ మండలం అంక్సాపూర్‌లో సర్పంచ్ పదవిని రూ.26.40 లక్షలకు వేలం వేశారు. అధికారులకు అనుమానం రాకుండా డమ్మీ నామినేషన్లు వేయించారు. తరువాత డమ్మీ అభ్యర్థులను ఉపసంహరింపచేసి ఏకగ్రీవం అయ్యేలా చేశారు.
● మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామంలో మొరం, ఇసుక దందాలో ఆరితేరిన ఓ మాజీ సర్పంచ్, అతని కుమారులు హవా నడిపిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని మేనేజ్ చేసుకుంటూ అక్రమంగా సంపాదించిన డబ్బుతో సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన ముగ్గురు ఎస్సీ కమ్యూనిటీ అభ్యర్థులను కిడ్నాప్ చేసి ఎన్నికలు లేకుండా చేశారు. ఈ అక్రమార్కులు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులను భయపెట్టించి, ఇద్దరితో నామినేషన్లు ఉపసంహరణ చేయించి ఒకరిని మాత్రమే బరిలో ఉంచి ఏకగ్రీవం చేయించారు. ప్రస్తుతం ఇసుక, మొరం దందాకు పకడ్బందీ పథక రచన చేసినట్లు తెలిసింది.
నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో వీడీసీ రెండుగా చీలిపోయింది. అయితే ఇక్కడ ఒక వీడీసీ మాత్రం ఒక అభ్యర్థినే బరిలో నిలబడాలని తీర్మానం చేసింది. ఇక మరో వీడీసీ మరో అభ్యర్థిని నిలబెట్టింది. కాగా వీడీసీలు బలపర్చిన అభ్యర్థులు కాకుండా బోగ రాములు అనే మరో సొతంత్ర అభ్యర్థి బరిలో నిలిచాడు. కాగా ఒక్కరే నిలబడాలని తీర్మానం చేసిన వీడీసీ తమకు ఎదురు నిలిచి బరిలో నిలబడ్డ బోగ రాములును ఇబ్బందులకు గురిచేసింది. బోగ రాములు నామినేషన్ వేసేందుకు అధికార యంత్రాంగం మద్దతు తీసుకున్నాడు. ఎంపీడీవో సమక్షంలో రాములు నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. అయితే రాములును బలపరిచేవారు వీడీసీకి భయపడ్డారు. అతికష్టం మీద ఒక ఓటరు మద్దతు రాగా రాములు నామినేషన్ వేశాడు. ఒకే నామినేషన్ వేయాలని తీర్మానం చేసిన వీడీసీ రాములుకు ఓట్లు వేయకుడదని తీర్మానం చేసింది. దీంతో రాములు ఈ దౌర్జన్యంపై ఫిర్యాదు చేయగా ఈ నెల 4న పోలీసులు కేసు నమోదు చేశారు. వీడీసీ సభ్యులు స్టేషన్ బెయిల్‌పై బయటకు వచ్చారు. మరోవైపు తీర్మానం చేసిన వీడీసీ నిలబెట్టిన అభ్యర్థి కాకుండా మరో వీడీసీ నిలబెట్టిన అభ్యర్థి సర్పంచ్‌గా గెలుపొందాడు. స్వతంత్ర అభ్యర్థి రాములు మాత్రం మానవహక్కుల సంఘం వద్ద ఫిర్యాదు చేశాడు.
ప్రభుత్వం, ఈసీ, కోర్టు తీర్పులను సైతం ధిక్కరించే వ్యవహార శైలి
జీపీ పాలకవర్గాలు తమ కనుసన్నల్లో
పనిచేయాల్సిందేనని హుకుం
జిల్లాలో పలుచోట్ల వేలం ద్వారా ఎన్నికై న సర్పంచ్, ఉపసర్పంచ్‌లు
అధికారులకు, మానవహక్కుల
సంఘాలకు ఫిర్యాదులు చేసిన బాధితులు
తాజాగా వెల్మల్ గ్రామంలో బెల్ట్‌షాపు, చికెన్ దుకాణానికి వేలం వేసిన వీడీసీ


