అంగన్‌వాడీల్లో మెరుగైన సేవలందించాలి
● ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి
● బోధన్‌లో అంగన్‌వాడీ కేంద్రాలకు
ఉచితంగా గ్యాస్ పొయ్యిల పంపిణీ
బోధన్: అంగన్‌వాడీ కేంద్రాల పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది సమర్ధవంతంగా పని చేయాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సూచించారు. బోధన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని 113 అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచితంగా గ్యాస్ పొయ్యిలను స్థానిక దీక్షిత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు ఆదినారాయణ, నిత్యావసరుకులు భద్రపర్చుకునే ప్లా స్టిక్ కంటైనర్లను మున్సిపల్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకుడు తూము శరత్ రెడ్డి వితరణ చేశారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని లయన్స్ కంటి ఆస్పత్రి మీటింగ్ హాల్‌లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ వికాస్ మహ తో, సీపీడీపీవో పద్మతో కలిసి అంగన్‌వాడీ టీచర్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి ప్ర భుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షుడు నగేశ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


