ఓటరు జాబితాలో పొరపాట్లు ఉండొద్దు
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఆర్మూర్: తప్పిదాలు, పొరపాట్లకు తావు లేకుండా తుది ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని ఆమె గురువారం సందర్శించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, కమిషనర్ శ్రావణి, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ముసాయిదా జాబితాను ప్రదర్శించాలని, అభ్యంతరాలను స్వీకరించి సకాలంలో వాటిని పరిష్కరించాలన్నారు. ఈ నెల 12న తుది ఓటరు జాబితా వెలువరించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక్క ఓటు కూడా ఎంతో కీలకమైనందున అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు జాబితా నుంచి తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బోగస్ ఓటర్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన జరపాలని ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్ సుజాత, సిబ్బంది పాల్గొన్నారు.


